శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు. తిరుమలలో భక్తులను ఒక చోటి నుంచి మరో చోటికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులు అందించనున్నారు.
అశ్వినీ ఆసుపత్రి సర్కిల్ వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించారు టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి. శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతూ భక్తులకు అందుబాటులో ఉంటాయని వెంకయ్య చౌదరి వెల్లడించారు.
తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భక్తుల నుండి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వరితగతిన బస్సులను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావడంతో కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఈ బస్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భక్తులను ఉచితంగా చేరవేస్తాయని చెప్పారు.
ఈ ఉచిత ట్రిప్పుల ద్వారా భక్తులకు, ఆర్టీసీకి అదనపు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే టీటీడీ శ్రీవారి ధర్మ రథాల ద్వారా తిరుమలలో ప్రతిరోజూ 300 ట్రిప్పులను తిప్పుతోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులు తోడవ్వడంతో అదనంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. ప్రతి రెండు నిమిషాలకు బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమవ్వడంతో పాటు బహుముఖ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
Also Read:‘కుబేర’ …డిఫరెంట్ మూవీ!

