పీఎస్ఎల్వీ-సీ38 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ 38 వాహననౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. రిమోట్ సెన్సింగ్, మ్యాపింగ్లకు సంబంధించి మరింత శక్తివంతమైన భూపరిశీలక ఉపగ్రహం కార్టోశాట్-2ఈ ను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ 38 కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. .
ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర నెలకొల్పిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గడచిన రెండు నెలల కాలంలో 50 రోజులు ఇస్రోకు చాలా క్లిష్టమైన సమయమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే ఈ 50 రోజులలో ఇస్రో మూడు అంతరిక్ష ప్రయోగాలు చేసిందని గుర్తుచేశారు. మూడు ప్రయోగాలు అత్యంత భారీ వ్యయంతో కూడినవని, ప్రతిష్ఠాత్మకంగా భావించి, మూడు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని వారు తెలిపారు. ఈ విజయం ఇస్రోకు మరింత స్పూర్తినివ్వగా, ఇస్రో ఖ్యాతిని మరింతగా పెంచిందని వారు అభిప్రాయపడ్డారు. కార్టోసాట్ -2తోపాటు వివిధ దేశాలకు చెందిన మరో 30 నానో శాటిలైట్లను నింగిలోకి పంపారు. పీఎస్ఎల్వీ తీసుకెళ్లిన 30 నానో ఉపగ్రహాల బరువు 243 కిలోలు కాగా, కార్టోశాట్ 2 బరువు 712 కేజీలు. ఈ ఉప్రగహాలను వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లి 55 కిలోమీటర్ల ఎత్తు ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.