గోవా – శ్రీగావ్‌లోని శ్రీదేవి లైరాయి ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. గోవా రాజధాని పనాజీ నుండి సుమారు 40 కి.మీ దూరంలోని శ్రీ దేవి లైరాయి ఆలయంలో జరిగింది. వేలాది మంది భక్తులు హాజరైన సమయంలో అప్రమత్తత, ఆందోళన వల్ల ఆకస్మికంగా గుంపు తిరుగుబాటు జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, జనసందోహంలో ప్రజలు బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో గందరగోళానికి దారితీశాయి.
గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మరియు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
శిర్గావ్‌లో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని చెప్పారు. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం… స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను అని గోవా సీఎం తెలిపారు.
లైరాయి దేవి జాత్ర ప్రతి ఏడాది గోవా రాష్ట్రం షిర్గావ్ గ్రామంలో నిర్వహించబడుతుంది. ఇది దేవి లైరాయి (గౌరీ దేవి అవతారం) కు అంకితమైన ఉత్సవం. గోవా పౌరాణిక చరిత్రలో ఉన్న ఏడుగురు సోదరి దేవతల్లో ఒకరిగా ఆమెను పూజిస్తారు. ఈ ఉత్సవంలో ముఖ్యంగా ‘అగ్నిదివ్య’ అనే ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది.గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు.

