రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో నేడు ప్రారంభించనున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో మహత్తర కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ముస్తాబైంది.
ఈ కార్యక్రమం కోసం వేద ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లను చేసింది. జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి, నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట పోలీసు కమిషనర్ శివకుమార్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు గొల్లకుర్మ యాదవులతో గ్యాలరీలోనే ముఖాముఖి సమావేశమవుతారు.
అనంతరం డోలు వాయించి గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. కొండపాక మండలంలోని 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందిస్తారు. దీంతో ఈ పథకం లాంఛనంగా ప్రారంభమవుతుంది. అనంతరం లబ్ధిదారులనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సభ ముగిశాక మధ్యాహ్న భోజనం చేసి సీఎం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.
ఇదిలా ఉండగా..వర్షాకాలం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా హెలిప్యాడ్‌ను సైతం సిద్ధంచేశారు. వాతావరణ పరిస్థితులు ఎలా అనుకూలమైతే ఆ విధంగా ప్రయాణం ఉండేటట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. నాలుగు ఎకరాల విస్తీర్ణం కలిగిన పాఠశాల ఆవరణలో వర్షాలు వచ్చినా ఇబ్బందిలేకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లతో సభాస్థలిని ఏర్పాటు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని గొర్రెల యూనిట్ల లబ్ధిదారులు సభకు వచ్చేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
లబ్ధిదారులకు ప్రత్యేకంగా పాసులను ఇస్తున్నారు. వీఐపీలకు ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, తొమ్మిది మంది డీఎస్పీ, 22 మంది సీఐలు, 52 మంది ఎస్‌ఐలు, 700 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు. గజ్వేల్ నుంచి వచ్చే వాహనాలకు తిమ్మారెడ్డిపల్లి శివారు నుంచి కొండపాకకు వచ్చే దారిలో పార్కింగ్ కేటాయించారు.
సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు తహసీల్దార్ కార్యాలయం, మార్కెట్‌యార్డు ఆవరణలో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. వీఐపీలు, ద్విచక్రవాహనాల కోసం వేద ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.