సల్మాన్ ఖాన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సినిమాలతో సంబంధం లేకుండా సమాజానికి తనవంతు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటాడు సల్మాన్ .
ఇప్పటికే ఈ బాలీవుడ్ స్టార్ ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కండల వీరుడు ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారికి ఆర్థికంగా సాయం చేసి ప్రాణాలు కాపాడారు.
ముంబైకి చెందిన రాకేశ్ అవార్.. కాలేయ సమస్యతో బాధపడుతున్న తన చిన్నారికి చికిత్స చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కాలేయ మార్పిడి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో అతడు విరాళాల ద్వారా డబ్బు సేకరించాలనుకున్నాడు. ఇందులో భాగంగా సల్మాన్‌కు చెందిన ‘బీయింగ్ హ్యూమన్’ స్వచ్ఛంద సంస్థను సంప్రదించాడు.
దాని ద్వారా సల్మాన్ రూ. 2 లక్షలు ఇచ్చారు. టాటా ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి రూ. 5 లక్షలు, ముఖ్యమంత్రి ట్రస్ట్ నుంచి రూ. 3 లక్షలు సమకూరాయి. ఈవిధంగా మొత్తం రూ. 12 లక్షలు సమకూర్చడంతో ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చిన్నారికి నిన్న (జూన్ 18) సర్జరీ నిర్వహించారు. తన కూతురు ప్రాణాలు కాపాడటానికి అండగా నిలిచిన వారందరికీ రాకేశ్ ధన్యవాదాలు చెప్పాడు.
వాస్తవానికి ఈ సర్జరీ మే 31నే జరగాల్సి ఉంది. సమయానికి డబ్బు సమకూరకపోవడంతో వైద్యుల్ని ఇంకొన్ని రోజులు గడువు ఇవ్వమని కోరారు. ఇక ఇదిలా ఉండగా గతంలో తలలు అతుక్కొని జన్మించిన పిల్లల శస్త్ర చికిత్స కోసం రూ. 40 లక్షల సాయం అందించి తన ఉదారత చాటుకున్నాడు సల్లుభాయ్.
‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతూ .. దీని ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సాయం అందిస్తున్నాడు సల్మాన్ ఖాన్. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఇలాంటి వారికి తన వంతుగా సాయం చేస్తూ వారి హృదయాల్లో మళ్ళీ నిజమైన హీరోగా నిలిచిపోతున్నాడు.