దేశీయ టెలికంలోకి జియో ఎంట్రీ తరువాత మొబైల్ టారిఫ్‌లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన టెలికం కంపెనీలన్నీ చార్జీల్లో భారీ తగ్గింపులు, బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తున్నాయి. ఈ పోటీ నేపథ్యంలో చౌక డేటా రేట్లతో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ బొనాంజా ప్రకటించింది . తమ ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త 3జీ మొబైల్ డేటా ఆఫర్ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ చౌక-444పేరుతో ఈ ప్రమోషనల్ ప్రీపెయిడ్ ప్యాక్ ను తీసుకొచ్చింది.
దీనిలో భాగంగా రూ.444 రీఛార్జ్ తో రోజుకు 4జీబీ డేటాను 90 రోజుల పాటు ఇవ్వనుంది. అంతకముందు ప్రకటించిన ఎస్టీవీ 333 అకా ఏస్ ప్లాన్ కు మంచి స్పందన రావడంతో తాజాగా ఈ ఎస్టీవీ-444 ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది.
అన్ని సెగ్మెంట్లలోని తమ కస్టమర్లకు సరసమైన, సమర్థవంతమైన సర్వీసులు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ఆర్కే మిట్టల్ తెలిపారు. ప్రస్తుత టెలికాం మార్కెట్లో ట్రెండ్ కు అనుగుణంగా తమ కస్టమర్లకు మంచి ధరలను ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత టెలికాం ఆపరేటర్లు అందించే రోజువారీ డేటాలో ఇదే అత్యధికం.
ఈ స్కీమ్ కింద ఒక గిగాబైట్ 3జీబీ డేటా రూపాయి కంటే తక్కువకు దొరుకనుంది. బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థి కంపెనీలు రోజుకు 2జీబీ మొబైల్ బ్రాడ్ బ్యాండును అందిస్తున్నాయి. మొత్తానికి జియో దెబ్బకు అన్ని టెలికం కంపెనీలు కుదేలవడంతో ఆఫర్ల వరద ఊపందుకుంటోంది.