ముఖ్యమంత్రి కేసీఆర్ తన పెద్దమనసు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పట్ల విశ్వాసంతో ఉండేవారి విషయంలో ఎంతటి కేర్ తీసుకుంటారో..ప్రోటాకల్ వంటివి సైతం మరచి ఎలా ఆదరిస్తారో తెలిసిందే. మే 22న తన ఇంట్లో పనిచేసే అబ్బాయి పెళ్లిని కేసీఆర్ దంపతులే దగ్గరుండి జరిపించారు. ఇక 2015లో కేసీఆర్ ప్రత్యూషను దత్తత తీసుకున్న సంగతి కూడా తెలిసిందే.
సవతి తల్లి చేతిలో చిత్రహింసల పాలై.. చివరకు ఓ స్వచ్చంద సంస్థ సహాయంతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రత్యూషను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. తాజాగా ఆమె నర్సింగ్ కోర్సు చేస్తోందన్న సమాచారాన్ని అధికారులు మంగళవారం సీఎంకు వివరించగా ఆయన ఆనందం వ్యక్తంచేశారు.
అందరూ ఉన్నా.. అనాథలా మారిన ప్రత్యూష వేదనను చూసి కేసీఆర్ దంపతులు చలించిపోయారు. దీంతో ప్రత్యూషను తమ దత్తపుత్రికగా తీసుకొన్నారు. ప్రత్యూష చదువు, పెళ్లికి సంబంధించిన బాధ్యతలను తానే చూసుకుంటానని ప్రకటించిన కేసీఆర్.. ఇంటికి పిలిపించి భోజనం పెట్టడంతోపాటు ఆమెకు కోరుకున్న సాయం అందిస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివించి, ఆమెకు తానే పెళ్లి కూడా చేస్తానని ప్రకటించారు. సీఎం ఆమెకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించడంతో ఇప్పుడు నర్సింగ్ చేస్తున్న ప్రత్యూషకు అనాటి ప్రత్యూష చాలా మారిపోయింది. నర్సింగ్ డ్రెస్సులో కొత్తగా కనిపిస్తోందీ ప్రత్యూష.