KTR:విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదు

7
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన విధానం చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓ వైపు ప్రభుత్వ విద్యను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తూ… మరో వైపు ప్రైవేట్ విద్యను కూడా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందకుండా చేస్తూ వారిని పూర్తిగా విద్యకు దూరం చేసే కుట్రను రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించిన గురుకులాలను ఓ వైపు నిర్వీర్యం చేస్తూనే…మరో వైపు ప్రైవేట్ ఉన్నత స్థాయి విద్య విషయంలో అదే వైఖరిని అనుసరిస్తున్నారన్నారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం లేకుండా చేసి భద్రత పరంగా విద్యార్థులను భయాందోళనకు గురి చేశారన్నారు. అది చాలదన్నట్లుగా గురుకుల భవనాలకు కనీసం అద్దె కూడా చెల్లించకుండా స్కూల్స్ కు వాటి యాజమానులు తాళాలు వేసి దుస్థితి తెచ్చారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితిని చూడలేదన్నారు.

అటు గురుకులాల పరిస్థితి ఇలా ఉంటే…ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ కళాశాల్లో చదువుకునే విద్యార్థులను కూడా వదలటం లేదన్నారు. వారికి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను చెల్లించకుండా విద్యార్థులను తీవ్రంగా మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. అటు ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ…ఇటు ప్రైవేట్ కాలేజ్ లకు ఫీజులు చెల్లించకపోవటమంటే పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేయటమేనని కేటీఆర్ అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లు నిరవధికంగా బంద్ చేయటమంటే ఇంతకన్నా ప్రభుత్వానికి సిగ్గు చేటు ఏమీ ఉంటుందని కేటీఆర్ అన్నారు. బకాయిలు చెల్లించకపోతే కాలేజ్ లు బంద్ పెడతామని కాలేజీ యాజమాన్యాలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తోలు మందంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చదువు పూర్తి అయిన విద్యార్థులను ఫీజు బకాయిలు చెల్లించాలంటూ సర్టిఫికెట్లను ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నారన్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్ మెంట్ మీద ఆధారపడి చదువుతున్న విద్యార్థులు…ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటంతో రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, ఇటు స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వద్ద పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు కొనసాగించేందుకు అయ్యే డబ్బు లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అంతకుముందు ప్రభుత్వం బకాయిలు పెట్టిన రూ. 2 వేల కోట్ల ఫీజు బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ బకాయిలు అని అనుకోకుండా విద్యార్థులకు నష్టం వాటిల్లవద్దనే సహృదయంతో బకాయిలు చెల్లించామన్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల విషయంలో ఏమాత్రం చిత్తశుద్ది ఉన్న కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి వారికి బకాయిలు చెల్లించేదన్నారు. అటు విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్ ఇవ్వకపోవటంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ మీద ఆధారపడి చదువుకునే విద్యార్థులను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

Also Read:ఏపీలో రిపోర్టు చేయాల్సిందే..ఐఏఎస్‌లకు కేంద్రం ఆదేశం

అసలు రేవంత్ రెడ్డి సర్కార్ కు పరిపాలన అనుభవం, పేద ప్రజల బాధలు తెలియకపోవడం కారణంగానే విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రికి విద్యారంగంలో సమస్యలను తెలుసుకునే ఓపిక లేదన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి…ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపించే పనిలోనే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడని అన్నారు. అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్ లు నిరవధికంగా బంద్ ప్రకటించిన ముఖ్యమంత్రిలో చలనం లేదని విమర్శించారు.

వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో పాటు విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మతిలేని చర్యల కారణంగా ఇప్పటికే విద్యార్థులు అటు కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమస్య ను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. విద్యార్థులకు నష్టం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించదని కేటీఆర్ హెచ్చరించారు. రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ప్రభుత్వం ఒత్తిడి పెంచే విధంగా విద్యార్థులతో కలిసి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు.

- Advertisement -