తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంగారెడ్డికి చెందిన ముజీబ్ అహ్మద్ కుమారుడు ముబీన్ ఆహ్మద్ (25) రెండేళ్ల కిత్రం పీజీ చదివేందుకు అమెరికా వెళ్లాడు.నాల్గోతేదీ సాయంత్రం తాను పనిచేసే మాల్ వద్ద దోపిడీ ముఠా చేతిలో కాల్పులకు గురయ్యారు. రోజువారీ ఖర్చుల కోసం ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్న ముబీన్ సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కొందరు నల్లజాతీయులు వచ్చి డబ్బు, మొబైల్ ఇవ్వమని బెదిరించారు. అంగీకరించకపోవడంతో ముబీన్‌పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి పారిపోయారు. పొట్టలోకి, కాలేయంలోకి తూటాలు దూసుకుపోయాయని తెలిసింది.
ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ముబీన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఘటన గురించి అతని తల్లిదండ్రులకు ఒక రోజు ఆలస్యంగా తెలిసింది. డిఫెన్స్‌లో సివిల్ ఉద్యోగం చేస్తున్న ముజీబ్ ప్రస్తుతం మసాబ్‌ట్యాంక్‌లో ఉంటున్నారు. అమెరికా వెళ్లేందుకు త్వరగా వీసా ఇప్పించాలని మంత్రులు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. హరీశ్‌రావునూ కలిశారు. స్పందించిన మంత్రి కేటీఆర్ విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు.ఒకటిరెండు రోజుల్లో వీసా వస్తుందని, వచ్చినవెంటనే అమెరికా బైలుదేరుతారని వారి బంధువు ఒకరు చెప్పారు.