రైతు సంఘాలకే అధికారం…

324
Farmers will have all the power: KCR
- Advertisement -

రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విషయంలో రైతు సంఘాలకు విశేష అధికారాలు ఉంటాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారని … భూములు, రైతుల వివరాలను నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత గ్రామ రైతులందరి భాగస్వామ్యంతో గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. తరువాత మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామన్నారు.

రైతులు కనీస మధ్దతు ధర కంటే కొంచెం ఎక్కువగా వచ్చినప్పుడే సరుకును మార్కెట్లో అమ్ముకోవాలని, లేనట్లయితే రైతు సంఘాలకే పర్మిట్లు ఇచ్చి ప్రాసెసింగ్ (మిల్లింగ్) చేసే హక్కు కల్పిస్తామని చెప్పారు. బడ్జెట్ లోను రూ.500 కోట్ల మూల నిధిని కేటాయించి రాష్ట్ర రైతు సమాఖ్య ఖాతాలో వేస్తామన్నారు. ఈ మూల నిధికి తోడు బ్యాంకుల నుండి కూడా మరికొంత రుణం తీసుకుని రాష్ట్ర రైతు సమాఖ్యను ఆర్థిక శక్తిగా మారుస్తామని తెలిపారు. రైతులకు మంచి ధర ఇచ్చే విషయంలో, రైతులు తమ సరుకును ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి రాష్ట్ర రైతు సమాఖ్య దోహదపడుతుందని పేర్కొన్నారు.

Farmers will have all the power: KCR
మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే కవిత, సీనియర్ నాయకులు రామ సహాయం, రంగారెడ్డి డీసీఎమ్ఏస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, ఎంపీపీలు, జడ్పిటీసీలు, రైతు నాయకులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వున్నారు.

మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుకు మేలు చేసేందుకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటుందన్నారు. మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా వరకు ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలన్నీ మరమ్మత్తు చేసుకోవాలని సూచించారు. ఎల్ఎండీ దిగువన కూడా 8 నుండి 10 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో నీటి ప్రవాహం ఉండేందుకు అనువుగా ఎస్ఆర్ఎస్పీ కాలువలను సిద్దం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎస్ఆర్ఎస్పీ కాలువలను పరిశీలిస్తారు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడానికి సిద్దంగా వుందని, రైతులు, ప్రజాప్రతినిధులు కాలువల మరమ్మత్తుల విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. కాలువల వెంట నిరంతరం నీటి ప్రవాహం వుంటుందని, చెరువులు ఎప్పటికప్పుడు నింపుకుని రెండు పంటలు పండించుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

వ్యవసాయానికి సంబంధించి ప్రతీ దశలోను రైతు సంఘాలు ఎక్కడికక్కడ చొరవ తీసుకుని రైతుకు మేలు చేసే కార్యక్రమాలను సమన్వయం చేస్తాయన్నారు. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేసే విషయంలో, పరస్పర సమన్వయంతో రైతులు నిర్వహించుకునే వ్యవసాయ విధానాల్లో రైతు సంఘాలు సహాయకారిగా వుంటాయన్నారు. రైతుకు ఎకరానికి రెండు పంటలకు గాను రూ.ఎనిమిది వేల పెట్టుబడి అందించ‌డం వల్ల రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం తప్పుతుందని సీఎం అన్నారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని సిఎం చెప్పారు. వచ్చే ఏడాదికే కాళేశ్వరం పంప్ హజ్ ల నుండి గోదావరి నీటిని తీసుకుంటామన్నారు. మిడ్ మానేరు డ్యాం, లోయ‌ర్ మానేరు డ్యాంల ద్వారా వరంగల్ జిల్లాకు నీరు చేరుకుంటాయ‌ని తెలిపారు.

- Advertisement -