సిద్ధార్థ మూవీ రివ్యూ..

633
- Advertisement -

బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న సాగ‌ర్ హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం `సిద్ధార్థ‌`. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో కె.వి. దయానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. బుల్లి తెరపై తనదైన నటనతో మెప్పించిన సాగర్‌….సిద్ధార్థతో ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

కథ :

మలేషియా వెళుతూ విమానంలో సహస్ర (రాగిణి నంద్వాని)ని చూస్తాడు సిద్ధార్థ్‌(సాగర్‌). తొలి చూపులోనే ఆమెపై ప్రేమ పెంచుకొంటాడు. ద్వేషం చేసిన గాయం ప్రేమతోనే మాయమవుతుందని.. ఆ ప్రేమే సహస్ర అని నమ్ముతాడు. సహస్ర కూడా సిద్ధార్థ్‌ని ప్రేమిస్తుంది. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకొంటారు. ఇంతలో అనుకోకుండా సిద్ధార్థ ఇండియా వెళ్లాల్సి వస్తుంది.

కానీ అక్కడ  ఊహించని విధంగా తన ప్రేమను త్యాగం చేయాల్సి వస్తుంది. సాగర్ తన ప్రేమను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది ? అసలు సిద్ధార్థ్ గతమేమిటి ? సిద్ధార్థ్, సహస్రలు చివరకు ఏలా కలిశారన్నదే  మిగితా కథ.

sidharth

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సాగర్ నటన,సాంకేతికత,సెకండాఫ్‌. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు దయానంద్ తన కథనంతో సినిమాని కాస్త కొత్తగా చూపడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. కథను అర్థమయ్యేటట్టు నడిపిన విధానం బాగుంది. తొలి సినిమానే అయినా సాగర్‌ బుల్లితెర నటన అనుభవంతో మంచిమార్కులే కొట్టేశాడని చెప్పాలి. సహస్రగా రాగిణి నంద్వాని తన పరిధి మేర నటించింది. అందంతో ఆకట్టుకుంటూ.. భావోద్వేగాల పరంగా పాస్‌ అయింది. హద్దులేమీ లేవంటూ ముద్దు సన్నివేశాల్లోనూ మెరిసింది. మరో కథానాయిక సాక్షి చౌదరి పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. అజయ్‌.. సుబ్బరాజు.. కోట శ్రీనివాసరావు.. రణదీప్‌ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.

మైనస్ పాయింట్స్ :

సిద్ధార్థ.. సహస్రల మధ్య ప్రేమ సన్నివేశాల్ని బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. లవ్‌.. రొమాన్స్‌.. కుటుంబ కక్షలు ప్రధానంగా కథని తీర్చిదిద్దారు. వీటిలో రొమాన్స్‌ మినహా మిగతా అంశాలేవీ పండలేదు. కథకు కొత్త కలరింగు ఇవ్వాల్సి ఉంటే బాగుండేది. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి వూహకి తగ్గట్లే సాగుతుంది. సాగర్ ను సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ముందు వరకూ పెద్దగా వాడకపోవడం బాగోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు పడతాయి. ఎమోషన్, రొమాన్స్ తో ఫస్ట్ హాఫ్ ను కాస్త కొత్తగా, ఆసక్తిగా నడిపించే ప్రయాత్నం చేశాడు దయానంద్. ఎస్‌.గోపాల్‌రెడ్డి సినిమాటో గ్రఫీ బాగుంది. మలేషియా లొకేషన్లను కొత్తగా చూపించారు. మణిశర్మ సంగీతం బాగుంది. ప్రవీణ్‌ పూడి కత్తెరకి మరింత పదును పెట్టాల్సింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఎక్కడా తగ్గకుండా సినిమాను చాలా రిచ్ గా నిర్మించాడు.

sagar

తీర్పు :

రెండు కుటుంబాల మధ్య పగ.. ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథ ఇది. 90వ దశకం నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ తరహా కథల్ని చూస్తూనే ఉన్నారు. చక్రవాకం,మొగలి రేకులు వంటి ఎమోషనల్ డైలీ సీరియళ్ళలో బలమైన పాత్రల్లో నటించి మెప్పించిన సాగర్‌…సిద్ధార్థగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో, హీరో హీరోయిన్ల మధ్య నడిచే మంచి రొమాన్స్ తో ఆసక్తిగా సాగిన ఫస్ట్ హాఫ్ ప్లస్ పాయింట్ కాగా చప్పగా సాగిన సెకండాఫ్, క్లైమాక్స్ నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తంగా సాగర్ ‘సిద్ధార్థ’ జస్ట్ ఓకే.

విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2016
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సాగర్, రాగిణి నంద్వాని, సాక్షి చౌదరి
సంగీతం : మణిశర్మ
నిర్మాత : దాసరి కిరణ్ కుమార్
దర్శకత్వం : కె.వి. దయానంద్

- Advertisement -