జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కొన్ని వస్తువులపై రేట్లను ఖరారు చేసేందుకు ఈ రోజు (శనివారం 03-06-17) ఢిల్లీలో సమావేశమైంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ రోజు జీఎస్టీ 15వ సమావేశం జరిగింది.
అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం పలు వస్తువులపై విధించిన పన్నుల వివరాలు…
బంగారంపై 3శాతం పన్ను విధించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. రెడీమేడ్ దుస్తులపై 12శాతం, నూలు, మిల్లు వస్త్రాలపై 5శాతం, రూ.500లోపు ఉన్న పాదరక్షలపై 5శాతం, రూ.500 దాటిన పాదరక్షలపై 18శాతం చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు.
గత నెలలో జరిగిన సమావేశంలో 1200కు పైగా వస్తువులు, 500 వరకూ సేవలకు నాలుగు శ్లాబుల్లో 5, 12, 18, 28 శాతం చొప్పున రేట్లు నిర్ణయించిన కౌన్సిల్ ఈ రోజు పసిడి, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు తదితర అంశాలకు సంబంధించి రేట్లను ఖరారు చేసింది. అంతే కాకుండా ఇతర వస్తువులపై విధించాల్సిన పన్నుల అంశంపై కూడా ఈ భేటీలో చర్చించారు.