తెలంగాణా ప్రజలందరికీ ఆనందకరమైన రోజు. అందరు కలిసి పండుగ చేసుకోవాల్సిన సమయం వచ్చింది . దశాబ్దాల పోరాటం తర్వాత మన తెలంగాణా రాష్ట్రం అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడింది. మన నీళ్ళు, నిధులు, నియామకాలపై మనకే నిర్ణయాధికారం వచ్చింది. అందరం కలిసి పండుగ చేసుకుంటూ, వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, ముందు ‘మంచి’ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం.
అమెరికాలో తెలంగాణ మిత్రులందరూ కలిసి న్యూ జెర్సీ లో రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో పెద్ద ఎత్తున ఈ సంబరాలను నిర్వహించడానికి సన్నాహాలను చేస్తున్నారు. గత నెల రోజులుగా జట్టులుగా ఏర్పడి పండుగ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంబరాలు జూన్ 4 న ఉదయం 11 నుండి 3 pm వరకుంటాయి. అందరూ ఆహ్వానితులే!
ఈ పండుగలో ప్రత్యేకంగా బోనాలు, బతుకమ్మ, పీర్లు, డప్పులు, కోలాటం ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చిన్నారులు తెలంగాణా ఆట పాటలను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ మహిళలు చేనేత కు మద్దతుగా “చేనేత ఫాషన్ షో ” ప్రదర్శిస్తున్నారు.మిత్రులందరూ పాల్గొని, ఈ సంబరాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని తెలంగాణ సంబరాల ఆహ్వాన కమిటి తెలిపింది.