కేంద్ర కేబినెట్‌లోకి రామ్మోహన్‌నాయుడు

13
- Advertisement -

కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెదేపా ఎంపీలకు స్థానం ఖరారయింది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌లకు తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్‌ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర క్యాబినెట్‌ బెర్తు ఖరారు చేశారు.

సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా తెదేపాకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటిచ్చి చంద్రబాబు ఈ ప్రాంతం తమకెంత కీలకమో చాటిచెబుతున్నారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో తెదేపా చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రన్నాయుడికి అవకాశం ఇచ్చారు. 2014లో ఎన్డీయే సర్కారులో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజు ను ఎంపిక చేశారు. ఇప్పుడు రామ్మోహన్‌నాయుడికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై తెదేపాకున్న మక్కువను మరోసారి ప్రకటించినట్లయింది.

Also Read:మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారం..

కింజరాపు రామ్మోహన్‌నాయుడు

స్వస్థలం: నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా
వయసు: 36 సంవత్సరాలు
విద్యార్హత: బీటెక్, ఎంబీఏ
తల్లిదండ్రులు: విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు
భార్య: శ్రావ్య, కుమార్తె: నిహిరఅన్వి శివాంకృతి

రాజకీయ నేపథ్యం: తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెదేపా తరఫున తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ఓటమిపాలయినా తాను మాత్రం ఎంపీగా గెలిచి, పట్టు నిలబెట్టుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యలు నిర్వహిస్తున్నారు. రామ్మోహన్‌నాయుడి చిన్నాన్న అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. సోదరి ఆదిరెడ్డి భవాని మొన్నటి వరకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్‌ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisement -