ఆవిర్భావ దినోత్సవం..సీఎస్ రివ్యూ

11
- Advertisement -

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో, అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహించనున్నట్లు సీఎస్‌ తెలిపారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారని అన్నారు.

ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రజలు ఎండకు గురికాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి, షామియానాలతో నీడ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు.

సభా ప్రాంగణం పరిసర పారంతాలలో పారిశుద్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిరంతరాయంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని విధ్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Also Read:విశ్వక్ సేన్ సాహాసం..ఫ్లాప్ సినిమా రీమేక్!

- Advertisement -