రజనీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ 161వ చిత్రం ‘కాలా’. ‘కబాలి’ విజయం తర్వాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్నారు. 2018లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
అయితే చుట్టూ మురికివాడ, భవనాలు, రైలు పట్టాలపై ఆడుకుంటున్న పిల్లలు, వీటి మధ్య జీపుపై స్టైల్‌గా మాస్‌లుక్‌తో కాలుమీద కాలేసుకుని కూర్చున్న రజనీ, ఆయన వెనుక నుంచి తొంగి చూస్తున్న ఓ కుక్క.. ఇలా ఈ పోస్టర్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. దాంతో కాలా పోస్టర్‌కి భారీ క్రేజ్ వచ్చిపడింది.
ఇదిలాఉంటే.. మాస్‌లుక్‌తో రజినీ స్టైల్‌గా కూర్చున్న జీపు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ‘కాలా’ సినిమా పోస్టర్లో రజనీకాంత్ కూర్చున్న జీపు కావాలని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోమవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్లో రజనీ మహీంద్రా థార్ జీపుపై స్టైల్‌గా కూర్చొని ఉంటారు.
దీనిని చూశాక వెంటనే రజనీ కూర్చున్న థార్ వాహనానం కావాల్సిందేనని ఫిక్స్ అయిన ఆనంద్ మహీంద్రా.. తమ కంపెనీ మ్యూజియంలో పెట్టుకునేందుకు ఆ జీపును ఇవ్వాల్సిందిగా చిత్ర బృందాన్ని కోరారు. ‘సూపర్‌స్టార్ రజనీలాంటి లెజెండ్ కారుని సింహాసనంలా వాడుకుంటే.. కారు కూడా లెజెండ్ అయిపోతుంది’ అని ట్వీట్ చేశారు.
అయితే దీనిపై రజనీ అల్లుడు, నటుడు ధనుష్ స్పందిస్తూ.. ‘చాలా థ్యాంక్స్ సర్. ప్రస్తుతం కారుని చిత్రీకరణ కోసం వాడుతున్నాం. అయిపోగానే మీకు పంపే ఏర్పాట్లు చేస్తాం.’ అని ట్వీట్ చేశారు. మొత్తానికి రజనీ కూర్చున్న కారుని ఆనంద్ మహీంద్రా పట్టేశాడు. ప్రస్తుతం కాలా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ఇందులో రజనీకి జోడీగా హ్యుమా ఖురేషీ నటిస్తోంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం సమకూరుస్తున్నారు.