ఏపీ బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందా ? టీడీపీ జనసేన పార్టీలను గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏపీలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. గత ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ ఎంత బలహీనంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. అయినప్పటికి ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆ పార్టీకి పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ సీట్లను త్యాగం చేశాయి టీడీపీ జనసేన పార్టీలు. మరి ప్రస్తుతం బీజేపీ పోటీ చేసే స్థానాల్లో కూడా గెలిచే అవకాశం ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టమే అయినప్పటికి చంద్రబాబు, పవన్ బీజేపీకి అధిక ప్రదాన్యం ఇస్తూ వచ్చారు. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందనే ధీమాలో వారు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ చంద్రబాబులను గుప్పిట్లో ఉంచుకునే దిశగా బీజేపీ పెద్దలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది, అందులో భాగంగానే మరో అసెంబ్లీ సీటును బీజేపీ డిమాండ్ చేస్తునట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన పోటీ చేయబోయే ఓ అసెంబ్లీ సీటును బీజేపీ డిమాండ్ చేస్తోందట. ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేన పార్టీ చాలా సీట్లనే త్యాగం చేసింది. మొదట 24 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికి బీజేపీ కోసం రెండు సీట్లను త్యాగం చేసి 21 స్థానాల్లోనే పోటీ చేసేందుకు సిద్దమైంది. ఇప్పుడు మరో సీటు త్యాగం చేస్తే 20 సీట్లకే జనసేన పరిమితం అవుతుంది. ఈ పరిణామం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు కూటమి నుంచి సిఎం అభ్యర్థిగా కూడా బీజేపీ నుంచే ఉండాలనే వాదన కూడా కమలనాథులు అడపా దడపా వినిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేకపోయిన టీడీపీ జనసేన పార్టీలను బీజేపీ నడిపిస్తోందనే వాదన పెరుగుతోంది. మరి బీజేపీ చేస్తున్న మైండ్ గేమ్ కు పవన్, చంద్రబాబు లొంగుతారా ? లేదా అనేది చూడాలి.
Also Read:శర్వానంద్..’మనమే’ ఫస్ట్ సింగిల్