అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రారాండోయ్.. వేడుక చూద్దాం.. ప్రేమమ్ సినిమా ఇచ్చిన విజయంతో.. తన తండ్రి నాగార్జున ప్రోత్సాహంతో `నిన్నే పెళ్ళాడతా` తరహా కుటుంబ కథని ఎంచుకొని `రారండోయ్.. వేడుక చూద్దాం` చిత్రం చేశాడు నాగచైతన్య. మరి.. కుటుంబ కథలో నాగచైతన్య ఎలా ఒదిగిపోయాడు? నాగార్జునకి `నిన్నే పెళ్లాడతా`లాగా నాగచైతన్య కెరీర్‌కి `రారండోయ్…` కీలక మలుపు అయినట్టేనా? అన్నది తెలియాలంటే వ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:
చాలా గారాబంగా పెరిగిన ఓ పల్లెటూరు అమ్మాయి భ్రమరాంబ(రకుల్‌ప్రీత్‌సింగ్). ఆమెకు తన తండ్రి (సంపత్) అంటే చాలా ఇష్టం. మనసులో ఏదైనా ఫిక్సయితే అది చేసేరకం. భ్రమరాంబ పట్టణానికి వెళ్లాల్సిన సందర్భంలో అక్కడ అబ్బాయిలతో జాగ్రత్త అని అమ్మ జాగ్రత్తలు చెబుతుంది. పట్టణంలో పరిచయమైన శివ(నాగ చైతన్య)తో ప్రేమ అంటూ వెంట పడొద్దని ముందే హెచ్చరిస్తది భ్రమరాంబ. ఈ షరతుకు శివ ఒప్పుకున్నప్పటికీ.. భ్రమరాంబపై ప్రేమను దాచుకోలేక.. ఆమెకు చెప్పలేక తెగ సతమతమైపోతాడు శివ.ఈ విషయం చెబితే ఆమె ఎక్కడ దూరం అవుతుందోనని బయటకు చెప్పడు. ఫ్రెండ్‌షిప్‌ను అడ్డుపెట్టుకుని శివ తనను ప్రేమిస్తున్నాడన్న విషయం భ్రమరాంబకు అర్థమౌతుంది. దీంతో శివకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోతుంది. మరి.. వీరిద్దరూ ఎలా కలిశారు? వీరి కుటుంబ నేపథ్యాలు ఏమిటి? శివ తండ్రి(జగపతిబాబు)కి భ్రమరాంబ తండ్రికి ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
కుటుంబ వాతావరణం.. పల్లెటూరు అందాలతో సినిమా అంతా కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల. ఫస్ట్ హాఫ్‌లో శివ – భ్రమరాంబల మధ్య సన్నివేశాలు చాలా సరదాగా.. ఆహ్లాదకరంగా సాగుతాయి. వెన్నెల కిషోర్ కామెడీ మరో ప్రధానాకర్షణగా నిలుస్తుంది. తొలి అర్ధభాగంలో ఉన్న రెండు పాటలు.. చిత్రీకరించిన విధానం బాగుంది. సినిమా ఒక రొటీన్ రివెంజ్ డ్రామాతో నడిచినప్పటికీ దర్శకుడు కథను నడిపించిన తీరు కుటుంబ ప్రేక్షకులను బాగా అలరిస్తుందని చెప్పొచ్చు.. నాగ చైతన్య-రకుల్ జోడీ తొలిసారి తెరపై కనిపించినా వారి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పాలి. ఓ అల్లరి అబ్బాయి పాత్రలో చైతూ.. భ్రమరాంబ పాత్రలో రకుల్ ఇమిడిపోయారు. జగపతిబాబు మరోసారి హుందాగా కన్పించారు. సంపత్‌రాజు నటన ఆకట్టుకుంటుంది. చాలా మంది కమెడియన్లు తెరపై కన్పించినా వెన్నెల కిశోర్ మాత్రమే నవ్వించగలిగారు.
మైనస్ పాయింట్స్:
సినిమా ఆరంభం బాగానే ఉన్నాఅవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది.చిత్ర క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ తో సులభంగా, రొటీన్ గానే ముగిసిపోయింది. సన్నివేశాల్ని అందంగా రాసుకున్న దర్శకుడు కథను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఆ సన్నివేశాలకు మరింత బలం చేకూరేది. నాగ చైతన్య, జగపతిబాబు, రకుల్‌ప్రీత్ సింగ్ మధ్య వచ్చే సన్నివేశాలపైనే దర్శకుడు దృష్టి పెట్టిన దర్శకుడు మిగతా విషయాలను కాస్త పట్టించుకుని ఉంటే ఇంకా బాగుండేది.
సాంకేతిక విభాగం :
సొగ్గాడే చిన్ని నాయనాతో హిట్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాతో మ్యాజిక్ చేయలేకపోయారు. కాస్త రొటీన్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్న అయన హీరోయిన్ రకుల్ ప్రీత్ పాత్రను, కొన్ని ఎమోషనల్ సన్ని వేశాల్ని రూపొందించడం, మంచి డైలాగులు, తండ్రి కొడుకులు, తండ్రి కూతుళ్ళ ట్రాక్స్ బాగానే రాశారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు వినడగానికి బాగానే ఉన్నా వాటిని తెరకెక్కించడంలో కళ్యాణ్ కృష్ణ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. ప్రతి సన్నివేశాన్ని రంగుల హరివిల్లుగా చూపించారు ఛాయాగ్రాహకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
సినిమా అంతా కలర్‌ఫుల్‌గా.. కుటుంబ వాతావరణం.. పల్లెటూరు అందాలతో ప్రతి ఫ్రేమ్‌ను చాలా అందంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇటీవల ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ ‘నిన్నే పెళ్లాడుతా’తో పోల్చిన విషయం తెలిసిందే. ఆయన అన్నట్లే ఈ సినిమా చూస్తుంటే కృష్ణవంశీ సినిమా చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కళ్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు మంచి వినోదాన్నిస్తుంది..
విడుదల తేదీ:26/05/2017
రేటింగ్:3.25/5
నటీనటులు: నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: నాగార్జున అక్కినేని
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల