దేశంలోని నదీ వంతెనల్లో అత్యంత పొడవైన ‘ధోలా సదియా’ వారథిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అసోంలోని తీన్‌సుకియా జిల్లాలో చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్‌పై ధోలా-సాదియా వంతెన నిర్మించారు. ఇది అసోం రాజధాని దిస్‌పూర్‌కు 540కి.మీ.లు.. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్‌కు 375 కి.మీ.ల దూరంలో ఉంది.
బ్రిడ్జి ప్రారంభించేందుకు శుక్రవారం అసోం చేరుకున్న ఆయన… భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తదితర సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న సందర్భంగా…. 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి కేంద్ర ప్రభుత్వ వార్షికోత్సవాల్లో భాగం కావడం విశేషం. అంతేకాదు అసోంలో బీజేపీ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భం కూడా దీనికి కలిసొచ్చింది.
అంతేకాకుండా రూ. 2,056కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనతో భారత్-చైనా సరిహద్దులోని సైనిక శిబిరాలకు రక్షణ సామాగ్రిని చేరవేయడానికి ఈ వంతెన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.
ఇదిలాఉండగా వంతెన ప్రారంభించిన అనంతరం ప్రధాని కారులో ప్రయాణించారు. కాస్త దూరం వెళ్లాక కారు నుంచి దిగి భద్రతను పక్కన పెట్టి కొంతదూరం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి వంతెనను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి అధికారులతో వంతెన నిర్మాణం గురించి చర్చించారు.