ఆత్మహత్యలు,వలసలకు నిలయమైన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపింది గులాబీ జెండా అన్నారు మాజీ సీఎం కేసీఆర్. 2001లో గులాబీ జెండా ఎగిరిన నాడు తెలంగాణ వస్తాదా అని అంతా అనుమానం కానీ ఒక్కడిగా మొదలు పెట్టిన ఉద్యమంలో ప్రజలను మమేకం చేసి తెలంగాణ సాధించామన్నారు. కరీంనగర్ ఎస్‌ఆర్ఆర్ కళాశాలలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో మాట్లాడిన కేసీఆర్…నాడు తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్ అన్నారు. నాడు కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఒక్క కేసీఆర్‌ను ఓడించడానికి ప్రభుత్వమంతా దిగిన ప్రజలు గులాబీ జెండానే గుండెకు హత్తుకున్నారన్నారు. కరీంనగర్ గడ్డ..బీఆర్ఎస్ అడ్డ అన్నారు.
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేస్తే వందరోజుల్లోనే వాళ్ల పనితీరు బయటపడిందన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలకు,వారి నోళ్లకు మొక్కాలన్నారు. రైతు బంధు అడిగితే చెప్పులతో కొడతామని ఓ మంత్రి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చెప్పులతో కొడితే ఎక్కడ ఉంటారో ఆలోచించాలన్నారు.
ముఖ్యమంత్రిని ఆరు గ్యారెంటీలు ఏవని అడిగితే పండబెట్టి తొక్కుతా, పెండ మొఖానికి రాసుకుంటా,మానవ బాంబునైతా అని మాట్లాడుతన్నారని ఇది పద్దతేనా ఆలోచించాలన్నారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మానవ బాంబులవుతామని మాట్లాడటం కరెక్టేనా ఆలోచించాలన్నారు. తెలంగాణ వ్యతిరేకించిన వారిని దద్దమ్మలు అన్నా కానీ ముఖ్యమంత్రిగా ఏనాడూ నోరు జారలేదన్నారు. తెలంగాణ వచ్చిన నాడు కరెంట్ లేదు, మంచినీటి కొరత,చేనేత కార్మికుల ఆకలిచావులు,రైతుల ఆత్మహత్యలు ఇలాంటి భయంకరమైన పరిస్థితులను గట్టెక్కించానని తెలిపారు. ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా డబ్బులు లేవని ఏనాడూ మొహం చాటేయలేదన్నారు.
భగీరథ ప్రయత్నం చేసి మంచినీరు తీసుకొచ్చామని, ఇంటింటికి నీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగనని చెప్పానని గుర్తు చేశారు కేసీఆర్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మంచినీళ్లు ఇచ్చే సోయి కూడా లేదన్నారు. రైతులకు కరెంట్ ఇచ్చే దమ్ము కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడే గులాబీ జెండాను ఎగరేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.ఒక్క నవొదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలన్నారు.బండి సంజయ్‌కి, వినోద్ కుమార్‌కి పోలిక ఉందా ఆలోచించాలని, నిజాయితీకి మారు పేరు వినోద్ కుమార్ అన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తి వినోద్ కుమార్ అన్నారు. కేసీఆర్ ఉన్ననాడు ఒక ఎకరం అయినా ఏండిందా? ఇప్పుడు ఎందుకు పొలాలు ఎండుతున్నాయో ఆలోచించాలన్నారు. రైతుల బాగుకోసం రైతు బంధు తెచ్చి ఆదుకున్నామని, దేశంలో ఎక్కడ ఇలాంటి పథకం లేదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. కేసీఆర్ ఉన్ననాడు తెలంగాణ ఏట్లుడ్డే? ఇప్పుడు ఎలా ఉందో మీ కళ్ళ ముందే ఉందన్నారు. కాంగ్రెస్ నాయకుల బోనస్ బొగస్ అయిపోయిందని ఎద్దేవా చేశారు.
Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..
పోలీసు సోదరులారా అనవసరమైన కేసులు పెట్టకండి….మీరు రాజకీయాలలో తలదూర్చకండన్నారు కేసీఆర్. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు…ఇది మంచి పద్ధతి కాదు…పదేళ్లు మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీద అనేక కుక్కలు మొరిగినాయి…ఎవరి పాపాన వారు పోతారని వదిలేశాం…వీళ్ళలాగే మేము పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తే ఒక్క కాంగ్రెస్ వాళ్ళు మిగిలేవారా ? ఆలోచించాలన్నారు.