భారతీయ చిత్రపరిశ్రమలో తొలిసారి రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ‘మహా భారతం’ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమాను తీయనున్నట్లు ప్రముఖ దర్శకులు కొంత మంది అనౌన్స్ చేశారు.అయితే ‘మహా భారతం’ని ఒక్కో భాగంగా తెరకెక్కించాలని ఉందని ఆ మధ్య దాసరి నారాయణ రావు చెప్పాగా. ‘మహా భారతం’ను భారీ స్థాయిలో తెరకెక్కించడం తన డ్రీమ్ అని రాజమౌళి కూడా అన్నారు. ఇదే సమయంలో తనకి ‘మహా భారతం’ సినిమాను నిర్మించాలని ఉందని షారుఖ్ కూడా ప్రకటించాడు. ఇలా అంతా ‘మహాభారతం’పై దృష్టి పెడుతుండగానే, మలయాళ దర్శక నిర్మాతలు వెయ్యికోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ వ్యాపార వేత్త బి. ఆర్. శెట్టి ఈ సినిమాను నిర్మించనుండగా, శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను, మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ నేపధ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్‌కి మొదట్టోనే అడ్డంకులు మొదలౌతున్నాయి.
ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘ది మహాభారత’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు.అయితే ఈ సినిమాకి ‘మహాభారత’ అని పేరు పెడితే వూరుకోం అంటూ కేరళకు చెందిన హిందు ఐక్యవేది సంఘం హెచ్చరించింది. మహాభారత పేరు పెడితే సినిమాను విడుదల కానివ్వమంటూ సంఘం అధ్యక్షురాలు కె.పి శశికళ ప్రకటించారు. ‘నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నప్పుడు చిత్రానికి ఆ పేరే పెట్టాలి. అంతేకానీ వేద వ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారు? మా మాటలుపట్టించుకోకుండా అదే పేరు పెడితే సినిమా థియేటర్లలో ఆడనివ్వం.’ అని హెచ్చరించారు.
‘రాందమూళం’ నవల పాండవుల్లో రెండోవాడైన భీముడి గురించే ఉంటుంది.ఈ చిత్రంలో భీముడి పాత్రలో మోహల్‌లాల్ నటించనున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారు. 2018 సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలంటే 2020 వరకు వేచి చూడాల్సిందే మరి