TTD:రథసప్తమికి తరలివచ్చిన భక్తులు

17
- Advertisement -

సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్ల‌లో భక్తులు సౌక‌ర్య‌వంతంగా కూర్చుని వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించారు. శ్రీవారి సేవ‌కులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు. షెడ్ల‌కు అనుబంధంగా మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 850 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 700 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 2900 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.

టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో 10 వేల మంది భక్తులకు 25 మంది డాక్టర్లు, 50 మంది పారామెడికల్ సిబ్బంది వైద్యసేవలందించారు. 2 మొబైల్ క్లినిక్ లు, 5 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని నాలుగు మూలల్లో నాలుగు వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

- Advertisement -