బీజేపీ ‘రథయాత్ర’లు.. ఫలిస్తాయా?

28
- Advertisement -

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ గత కొన్నాళ్లుగా శతవిధాల ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కానీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ డీలా పడింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి రాష్ట్రంలో హడావిడి చేసేందుకు ప్రయత్నిస్తోంది కమలం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాలను అధిగమించి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా జాతీయ నేతలపైనే ఆధార పడుతూ వచ్చింది కమలం పార్టీ. కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం లోకల్ లీడర్స్ ను బలపరిచే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. అందులో భాగంగానే సరికొత్త కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుడుతోంది..

వచ్చే నెల 5 నుంచి 14 వరకు రథయాత్ర పేరుతో బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా విభజించి ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంలో ప్రాంతీయ నేతలను మెయిన్ హైలెట్ కానున్నారు. అంతే కాకుండా పార్టీలోని కీలక నేతలు కూడా రథయాత్రలో పాల్గొంటూ పార్టీకి మైలేజ్ తీసుకురావాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వినికిడి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది బీజేపీ.. మరి ఈసారి పదికి పైగా సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. పైగా కేంద్రంలో కూడా మూడో సారి అధికారం సాధించాలంటే మరింత బలపడాల్సిన అవసరత ఉంది. అయితే తెలంగాణలో బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అసెంబ్లీ ఎన్నికలతో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా కమలనాథులు రచిస్తున్న వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:Bandi:”బండి సీటు”.. వద్దు బాబోయ్!

- Advertisement -