తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ కొలువుతీరి నెల రోజులు పూర్తయింది. గత ఏడాది డిసెంబర్ 7 న తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల రోజుల్లో ఆయన పాలన ఎలా సాగింది ? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్పులు చేయవచ్చు ? ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకుందా ? అనే ప్రశ్నలు రాక మానవు. కొత్తగా అధికారం చేపట్టగానే రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలపై ప్రమాణస్వీకారం రోజునే సంతకం చేయడం, ప్రజా దర్బార్ చుట్టూ ఉన్న కంచెను తొలగించడం వంటివి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో మంచి మార్కులే వేసుకున్నారు. .
ఇక ఆరు గ్యారెంటీ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించి.. హామీలన్నిటికి ఒకే దరఖాస్తు కేటాయించారు. ఆరు హామీలలో ఐదు పథకాలకు ఒకే దరఖాస్తు ద్వారా ఆపై చేసుకునే వీలు తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఈ నెల రోజుల పాలనలో లోటుపాట్లు కూడా చాలానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా ఎదురవుతున్న అవరోధాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందనే టాక్ వినిపిస్తోంది. బస్సుల్లో మహిళలే ఎక్కువ ప్రయాణిస్తుండడం వల్ల పురుషులకు స్థలం లేకపోవడం, ఆటో డ్రైవర్లకు జీవనోపాధి దెబ్బ తినడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
అంతే కాకుండా హామీలు ఇచ్చేటప్పుడు ఎలాంటి పరిమితులు విధించని కాంగ్రెస్.. వాటి అమలు విషయంలో మాత్రం పరిమితిలు విధిస్తోందనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది, రూ 500 లకే గ్యాస్ విషయంలోనూ, మహిళలకు ప్రతి నెల రూ.2500 చెల్లించే విషయంలోనూ పరిమితులు విధించేందుకు ప్రభుత్వం సిద్దమౌతున్న టు టాక్. ఇప్పటికే ఉచిత బస్సు విషయంలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు మాత్రమే ప్రయాణాన్ని పరిమితం చేశారు. అలాగే మిగిలిన హామీల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ నెల రోజుల పాలనలో సంతృప్తి కంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందనే వాదన ప్రజల్లో వినిపిస్తోంది. మరి ముందు రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన ఎలా సాగుతుందో చూడాలి.
Also Read:గీతాంజలి మళ్ళీ వచ్చింది..ఎంజాయ్ చేస్తారు