ప్రతిష్టాత్మక కాన్స్ 70వ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా బాలీవుడ్ అందం ఐశ్వర్యారాయ్ బచ్చన్.. రెడ్ కార్పెట్ పై మరోసారి మెరిసింది. రెడ్ కార్పెట్ పై ఆమె నడుస్తుంటే… కళ్లప్పగించి చూస్తుండిపోయారు అక్కడి జనం. కాన్స్ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టే వరకు అందరిలోనూ ఆమె డ్రెస్ ఎలా ఉంటుందనే ఉత్కంఠకు తెరదించుతూ… కళ్లు చెదిరిపోయేలా అందంగా సింగారించుకుని… రెడ్ కార్పెట్ పై మతిపొగోట్టేలా చేసింది ఐష్.లేట్ గా ఎంటరైనా… లేటెస్ట్ గా ఎంటరైందంటూ.. ఐశ్వర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు.
మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పౌడర్ బ్లూ బ్రొకేడ్ బాల్ గౌన్ లో ఐశ్వర్య అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె అందం ముందు డిస్నీ రాకుమారి కూడా చిన్నబోయింది అంటూ ఐష్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. అంతకు ముందు కాన్స్ ఫొటోషూట్‌లో ఆకుపచ్చని డ్రెస్లోనూ ఐష్ కనువిందు చేసింది.
కాన్స్ 70వ సినీ ఉత్సవం మే 17న ప్రారంభమైంది. తొలిరోజు బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, మల్లికాషరావత్ ఎర్రతివాచీపై సందడిచేశారు. రెండో రోజు దక్షిణాది భామ శ్రుతిహాసన్ రెడ్‌కార్పెట్‌పై హొయలొలికించింది. ఇక మూడో రోజు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన అందంతో ఆకట్టుకుంది. ఐష్ కాన్స్‌లో పాల్గొనడం ఇది 16వ సారి. బాలీవుడ్ మరో నటి సోనమ్‌కపూర్ కూడా కాన్స్ ఎర్రతివాచీపై సందడి చేయనుంది.