వైఎస్ షర్మిల ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హాట్ టాపిక్ గా నిలుస్తూ వచ్చిన షర్మిల.. ఎప్పుడు ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్లు వినికిడి. అయితే ఇక్కడే అసలు చిక్కు.. ఎందుకంటే ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగు పెడితే ఆ ప్రభావం వైసీపీపై గట్టిగా పడుతుంది. ప్రస్తుతం టీడీపీ వర్సెస్ వైసీపీ గా ఉన్న ఏపీ రాజకీయాలు షర్మిల రాకతో జగన్ వర్సెస్ షర్మిల గా మారిపోతాయి..
ఆమె ఎంట్రీతో కాంగ్రెస్ బలపడుతుందో లేదో తెలియదు గాని వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం భారీగా చీలిపోయే అవకాశం ఉంది. అందుకే షర్మిల రాకపై వైసీపీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు వినికిడి. అయితే ఒకవేళ షర్మిల నిజంగానే ఏపీ రాజకీయాలపై దృష్టి పెడితే వైసీపీలోకి స్వాగతించాలని జగన్ భావిస్తున్నారట. జగన్ కు ప్రత్యర్థిగా పోటీ చేయకుండా వైసీపీ నుంచి ఆమెకు కడప ఎంపీ టికెట్ ఇచ్చే దిశగా జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు టాక్. కాగా గత కొన్నాళ్లుగా జగన్ మరియు షర్మిల తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఆ విభేదాల కారణంగానే ఆమె ఏపీ వదిలి తెలంగాణలో పొలిటికల్ పార్టీ పెట్టిన సంగతి విధితమే. అయితే ఇప్పుడు ఆ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేసి హస్తం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిచాలనేది షర్మిల ఆలోచనగా తెలుస్తోంది. మరి నిజంగానే షర్మిల తన అన్నకు వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తుందా ? అనేది ప్రశ్న ఆసక్తి రేపుతుంటే.. చెల్లెలు కారణంగా ఏర్పడే ముప్పు ను తప్పించేందుకు జగన్ ఎలాంటి వ్యూహరచన చేయబోతున్నారనేది మరో ప్రశ్న. మరి ఒకవేళ జగన్ వైసీపీలోకి షర్మిలను తిరిగి ఆహ్వానిస్తే ఆమె వెళుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. మరి ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
Also Read:సీఎం రేవంత్ కీలక నిర్ణయం..