వెంకటేశ్ తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. సంపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం వెంకటేశ్’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. విక్టరీ వెంకటేష్ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘సెలబ్రేటింగ్ వెంకీ 75’ పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కొన్ని వేడుకలు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాంటి వేడుకే ఇది. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నారు వెంకీ. తన ‘మల్లీశ్వరి’ నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్, ప్రేమ కథలు.. ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నా. మేం కలిసి సినిమా చేయాలనేది తన కోరికా నా కోరికా కూడా. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం అత్యంత ఆనందకర విషయం అవుతుంది” అన్నారు.
విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ ‘‘గురువు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘కలియుగ పాండవులు’తో నా ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాల్ని గమనించి ప్రోత్సహించారు. మొదట్లో ‘విక్టరీ’ అనేవారు. తర్వాత ‘రాజా’ అని పిలిచారు. కొన్నాళ్లు ‘పెళ్లికాని ప్రసాద్’ అన్నారు. తర్వాత ‘పెద్దోడు’, ‘వెంకీ మామ’ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను. నా 75వ చిత్రం ‘సైంధవ్’ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందర్నీ అలరిస్తుంది. నా ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం ఎంతో గొప్పది. చిరంజీవి గారితో కలిసి త్వరలోనే సినిమా చేస్తా’’ అన్నారు.
దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘వి అంటేనే విక్టరీ అనే డైలాగ్‌తోనే వెంకటేశ్ ప్రయాణం మొదలైంది. అందుకు తగ్గట్టే తన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. రామానాయుడు నాపై పెట్టిన బాధ్యత మేరకే వెంకటేశ్‌ని తెరకు పరిచయం చేశా. తన ఎదుగుదలకు మాత్రం తను ఎంచుకున్న కథలు, పాత్రలు, తన అన్నయ్యే కారణం. ఇన్ని రకాల సినిమాలు మరే హీరో చేయలేడేమో అనేలా ఆయన కెరీర్ కనిపిస్తుంది’’ అన్నారు.
నాని మాట్లాడుతూ ‘‘అందరి అభిమానులు ప్రేమించే హీరో వెంకటేశ్. తెరపైనా, తెరవెనుక ఆయన జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి నటుడి కుటుంబం వెంకటేశ్‌లా ఉండాలని కోరుకుంటుంది’’ అన్నారు.రానా మాట్లాడుతూ ‘‘మా కుటుంబంలో చిన్నాన్న మాకో గురువు. విజయం వచ్చినా పరాజయం ఎదురైనా అంతే సంతోషంగా ఉంటారు. ఆయనవల్లే నేనిలా ఉన్నా’’ అన్నారు.సురేశ్ బాబు మాట్లాడుతూ ‘‘ఇన్ని సినిమాలకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వ్యవసాయ కుటుంబం నుంచి మేము ఈ వ్యాపారంలో ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, బాబీ, శైలేశ్ కొలను, శ్రీవిష్ణు, బ్రహ్మానందం, అలీ, నిఖిల్, విశ్వక్‌సేన్, అడివిశేష్, దామోదర్ ప్రసాద్, విజయ్‌భాస్కర్.కె, ముప్పలనేని శివ, భీమనేని శ్రీనివాసరావు, బెల్లంకొండ సురేశ్, రామ్ ఆచంట, గోపి ఆచంట, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, వెంకట్ బోయనపల్లి, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా, ‘సైంధవ్’ టీమ్ పాల్గొన్నారు.
Also Read:ముందు ఎన్టీఆర్ తోనా ?..చరణ్ తోనా ?