ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలు దిశగా అడుగులు వేస్తోంది. సిఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే ఆరు గ్యారెంటీ హామీలపై సంతకాలు చేసి ప్రజల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది హస్తం పార్టీ. అయితే ఆరు గ్యారెంటీ హామీలకు చట్టబద్దత లేకపోవడంతో వాటిని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతువచ్చాయి. అధికారం చేపట్టిన రెండు రోజులకే ఆరు గ్యారెంటీలలో భాగమైన మహాలక్ష్మి, ఆరోగ్య భీమా పథకాలను ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించారు సిఎం రేవంత్ రెడ్డి. మిగిలిన నాలుగు హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అయితే హామీల అమలు సవ్యంగా జరుగుతోందా అంటే ముమ్మాటికి కాదనే వాదన వినిపిస్తోంది. .
మొదట ఎన్నికల ముందు మహిళలకు ఆర్టీసీ అన్నీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టిన తరువాత కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ప్రయాణాన్ని పరిమితం చేసింది. ఇక వంటగ్యాస్ ను రూ.500 రూపాయలకే అందిస్తామని ప్రకటించిన హస్తం పార్టీ.. ఇప్పుడు ఆ హామీలో పరిమితులను విధించేందుకు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. కేవలం రేషన్ కార్డ్ ఉన్నవారికే ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది.
అయితే రేషన్ కార్డు లేని అర్హులు కూడా చాలా మంది ఉండడంతో వారి విషయంలో మరి కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుందనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే రూ.500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరా శాఖ అధికారాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇలా ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ సర్కార్ మెలికలు పెడుతుండటంతో అర్హులైన వాళ్ళు కొంత అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీ హామీలను ఇచ్చినట్లే ఇచ్చి వాటిని పరిమితి మేర అమలు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉందా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తుందో చూడాలి.
Also Read:Kavitha:కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి