తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. రేవంత్ రెడ్డిని ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ నేడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కూడా చేయించింది. ఇక రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. భారత రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించరాదు. అంతే తెలంగాణలో మొత్తం 119 ఎమ్మెల్యేలలో 15 శాతం అంటే 18 మందికి మంత్రి పదవులు కేటాయించవచ్చు. ఇక నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కొందరు కొత్తగా తొలిసారి మంత్రి పదవులు చేపట్టబోతున్నారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి వారు కొత్తగా మంత్రి పదవులు చేపట్టబోతున్నారు. ఇకపోతే మంత్రివర్గానికి సంబంధించి 11 మంది నేడు ప్రమాణస్వీకారం చేసినప్పటికీ వారికి ఇంకా ఎలాంటి శాఖలు కేటాయించలేదు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. భట్టికి డిప్యూటీ సిఎం మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఉత్తమ్ కు హోమ్ శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ, తుమ్మల కు రోడ్ల భవన నిర్మాణ శాఖ, పొంగులేటికి నీటిపారుదల శాఖ, కొండా సురేఖ కు మహిళా శిశు సంక్షేమ శాఖ, దామోదర రాజ నరసింహ కు ఆరోగ్య శాఖ.. కేటాయించే అవకాశం ఉందని వినికిడి. ఇకపోతే నేడు తొలి కేబినెట్ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశం తరువాత మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read:రేపటి నుండి ప్రజాదర్బార్:సీఎం రేవంత్