విజయవాడకు చెందిన సాయిశ్రీ వార్త మంత్రి కేటీఆర్‌ని కదిలించింది. ఈ వార్త చూసి తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ‘‘డాడీ.. నీ దగ్గర డబ్బుల్లేవంటున్నావ్.. కనీసం నా ఇల్లుందిగా.. ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో అయినా నాకు ట్రీట్‌మెంట్ చేయించు డాడీ.. ట్రీట్‌మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంట డాడీ.. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు డాడీ.. నన్ను బ్రతికించు డాడీ.. నేను స్కూల్‌కెళ్లి ఎన్ని మంత్స్ అయిందో నీకు తెలుసు కదా డాడీ.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది..” అంటూ కన్న కూతురు గుండెలవిసేలా ప్రాధేయపడ్డా కన్నబిడ్డ ప్రాణాలను గడ్డిపోచకంటే తేలిగ్గా తీసిపారేసేంత కఠినపాషాణుడైన తండ్రి తీరు పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్ర భావోద్వేగానికి లోనైన కేటీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. చిట్టితల్లి అలా అర్ధిస్తుంటే కరగని వ్యక్తి కూడా ఉంటారా? అంటూ బాధపడ్డారు. వెంటనే ట్విట్టర్ లో మానవీయ విలువలు ఇంతలా పతనమవుతున్నాయా? అంటూ ఆయన బాధను వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవత్వానికి తగిలిన దెబ్బ అని ఆయన వ్యాఖ్యానించారు.