మూడు రాష్ట్రాల్లో ‘ కాంగ్రెస్ బోల్తా ‘!

40
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో కనీసం మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేయాలని ఈ రెండు జాతీయ పార్టీలు గట్టిగా ప్రయత్నించాయి. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా ముందంజలో దూసుకుపోతున్నప్పటికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో హస్తం పార్టీకి గట్టి షాక్ తగులుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. రాజస్థాన్ లో ఆల్రెడీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఆ రాష్ట్ర ప్రజలు గట్టి షాక్ ఇస్తున్నారు. రాజస్థాన్ లో మొత్తం 199 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 100 కు పైగా సీట్లు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ఇక కాంగ్రెస్ మాత్రం 70 సీట్ల లోపే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఛత్తీస్ ఘడ్ లో కూడా హస్తం పార్టీపై బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ 90 సీట్లకు గాను బీజేపీ 50కి పైగా సీట్లు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ కేవలం 35 స్థానాల కంటే తక్కువే వచ్చే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. అలాగే మధ్యప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగులుతోంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు గాను బీజేపీ 165 స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. అటు కాంగ్రెస్ మాత్రం కేవలం 63 సీట్ల కంటే తక్కువ కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఐదు రాష్ట్రాలకు గాను ఒక్క తెలంగాణలోనే కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగగా మిజోరాంలో ఏంఎన్ఎఫ్ ప్రభావం సాగుతోంది. మిగిలిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఓటమి ముంగిట నిలిచింది.

Also Read:బీఆర్ఎస్‌కే జై కొట్టిన గ్రేటర్ ప్రజలు..

- Advertisement -