పవిత్రమైన కార్తీక మాసంలో డిసెంబర్ 11న వైజాగ్ లో దాతల సహకారంతో కార్తీకదీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో జెఈవో శనివారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కార్తీకదీపోత్సవంలో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన రికార్డింగ్ పనుల కోసం ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ సహకారం తీసుకోవాలని సూచించారు. అవసరమైన విభాగాల నుండి ముందస్తుగా డెప్యుటేషన్ పై సిబ్బందిని పంపాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా వెళ్లి వేదిక, క్యూలైన్లు తదితర పనులను ఎలాంటి జాప్యం లేకుండా చేపట్టాలన్నారు. ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని సూచించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
స్థానిక పోలీసుల సహకారం తీసుకొని తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. తగినంతమంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని, మీడియాతో సమన్వయం చేసుకోవాలని పీఆర్వో డా.టి.రవికి సూచించారు. ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కోసం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
Also Read:‘సలార్’పై ఆసక్తికర విషయాలు.. నిజంగా గ్రేట్