డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌లోకి దూసుకెళ్లింది. సిరాజ్ సూపర్ బౌలింగ్‌కు వార్నర్, విజయ్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన తోడవడంతో గుజరాత్ లయన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన రైజర్స్ ఎలాంటి సమీకరణాలు లేకుండానే ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పదో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న గుజరాత్ భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
154 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆదిలోనే గట్టి దెబ్బతగిలింది. ప్రవీణ్ కుమార్ ధాటికి మూడు ఓవర్లలో ధావన్ (18), హెన్రిక్స్ (4)లు ఔటయ్యారు. మరో ఓపెనర్ డెవిడ్ వార్నర్ భారీ షాట్లకు ప్రయత్నించకుండా జట్టును విజయతీరానికి చేర్చాడు. వార్నర్‌కు విజయ్ శంకర్ (63 నాటౌట్; 44 బంతుల్లో 9×4) తోడుగా నిలబడ్డాడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరూ సాహసాలకు పోకుండా.. వీలైనప్పుడే బౌండరీలు కొడుతూ, చకచకా సింగిల్స్ తీస్తూ చక్కని రన్‌రేట్‌తో స్కోరుబోర్డును నడిపించారు. అలవోకగా జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లు వార్నర్, శంకర్‌లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ జంట అభేద్యమైన మూడో వికెట్‌కు 133 పరుగులు జోడించింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం విశేషం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఇప్పటివరకు 13 శతక భాగస్వామ్యాలు నమోదు కాగా.. అందులో 12 భాగస్వామ్యాల్లో వార్నర్ పాలుపంచుకున్నాడు. ఒక్క సిక్స్ కూడా లేకుండా అర్ధశతకం పూర్తి చేయడం అతడికి ఇది రెండో సారి మాత్రమే.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్(4/32), రషీద్‌ఖాన్(3/34) గుజరాత్‌ను కుప్పకూల్చడంలో కీలకమయ్యారు. తొలుత ఓపెనర్లు ఇషాన్ కిషన్(40 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్మిత్ (33 బంతుల్లో 54; 7ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఓదశలో లయన్స్ భారీ స్కోరు దిశగా సాగుతున్నట్లు కనిపించింది. వీరిద్దరి విజృంభణతో తొలి పదోవర్లలో బౌండరీలు వెల్లువెత్తాయి. అయితే ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో స్మిత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఓపెనర్ల వీరవిహారంతో అలవోకగా రెండొందలపై స్కోరు చేసేలా కనిపించిన లయన్స్ కు గట్టి దెబ్బ తగిలింది. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ ఒకే ఓవర్లో కిషన్, కెప్టెన్ రైనా (2)ను సాగనంపగా, ఆ వెంటనే రషీద్ బౌలింగ్‌లో కార్తీక్ (0), ఫించ్ (2) పెవిలియన్ చేరారు. ఇక్కణ్నుంచి గుజరాత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. సిరాజ్ మరోసారి తన తఢాఖా చూపిస్తూ ఫాల్క్‌నర్(8), సాంగ్వాన్ (0)లను వరుస బంతుల్లో ఔట్ చేయడంతో లయన్స్ కుదేలైంది. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన గుజరాత్..నాలుగు బంతుల వ్యవధిలో ఆఖరి మూడు వికెట్లు అంకిత్ (0), ప్రవీణ్ (1), మునాఫ్ (0)లను కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది.