ప్రపంచంలోనే భారీ సైబర్ దాడి జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడి. దీంతో పలు దేశాల్లో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా భారత్ సహా 74 దేశాల్లో ఒకేరోజు సైబర్ నేరగాళ్లు 45వేల హ్యాకింగ్‌లకు పాల్పడ్డారు.
ప్రభుత్వ, ప్రయివేటు అని సంబంధం లేకుండా అన్ని రంగాలపైనా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. యాంటీవైరస్ ప్రొవైడర్ అవాస్త్ ఈ విషయాన్ని ప్రకటించింది. దాదాపు 75వేల కంప్యూటర్లలోకి మాల్‌వేర్ ప్రవేశించిందని, రష్యా రాజధాని మాస్కోలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై ల్యాబ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
తొలుత బ్రిటన్‌లోని పలు ఆసుపత్రులపై సైబర్ దాడి జరిగింది. ఐటీ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కంప్యూటర్లు తిరిగి పనిచేయాలంటే డబ్బులు చెల్లించాలన్న సందేశం తెరలపై కనబడటంతో అధికారులు విస్తుపోయారు. ఏం జరిగిందా..? అని ఆరా తీశారు. ఇంతలోనే ఈ దాడి ప్రపంచమంతా పాకింది. ‘వానా క్రై రాన్సమ్‌వేర్’ ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేసినట్లు తెలిసింది. అయితే ఎక్కువగా రష్యాలోనే హ్యాకింగ్‌కు గురయ్యాయట.
శుక్రవారం జరిగిన ఈ సైబర్ దాడిలో ఏపీలో పోలీస్ శాఖకు సంబంధించిన కంప్యూటర్లు హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. పర్సనల్ కంప్యూటర్లను వాడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఈ సమస్య తొలగిపోయే వరకూ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయకూడదని హెచ్చరిస్తోంది. మొబైల్ వినియోగదారులు కూడా ఇంటర్నెట్‌లో వచ్చే స్పామ్ మెసేజ్‌లకు స్పందించకూడదని సైబర్ నిపుణులు చెబుతున్నారు.