ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్రకు తిరుగులేదు. ఓ వైపు బ్యాట్స్‌మెన్ మరోవైపు బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండగా భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బర్త్ డే బాయ్ విరాట్ సెంచరీకి తోడు జడేజా 5 వికెట్లు తీయడంతో సఫారీలు చిత్తు అయ్యారు. భారత్ విధించిన 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రిక 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్ (14) టాప్ స్కోరర్ కాగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. జడేజా 5 వికెట్లు తీయగా షమీ, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 326 పరుగులు చేసింది.ముఖ్యంగా ఆరంభంలో రోహిత్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రోహిత్ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేయగా బర్త్ డే బాయ్ విరాట్ సెంచరీతో మరోసారి రాణించాడు.
విరాట్ కోహ్లీ 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్ గా నిలవగా శ్రేయాస్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. చివరలో జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 29 నాటౌట్‌గా నిలిచారు. సెంచరీతో రాణించిన విరాట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Also Read:హాయ్ నాన్న.. ఫుల్ మెలోడీ మంచి రెస్పాన్స్