మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ షేక్ చేశారు. రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లతో సత్తా చాటి తనలో ఉన్న జోరు ఇంకా తగ్గలేదని నిరూపించారు. ఖైది ఇచ్చిన జోష్తో 151 సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు చిరు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను రాంచరణ్ నిర్మించబోతున్నాడు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించడమే కాకుండా నటీనటుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్. అందులో భాగంగానే ‘బాహుబలి’ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, చిన్ననాటి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటిని ఈ ప్రాజెక్టులో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రానా ఖండించాడు. ఉయ్యాలవాడకు చెందిన యూనిట్ సభ్యులెవరూ ఇంతవరకు తనను సంప్రదించలేదని ఈ యంగ్ హీరో చెప్పాడు. ఈ వార్తలన్నీ పుకార్లేనంటూ తెలిపాడు. ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో పాటు మరో పీరియాడిక్ సినిమాలో రానా నటిస్తున్నాడు.
కాగా, ఇప్పటివరకూ ‘బాహుబలి 2’ సినిమా ప్రమోషన్స్ లో రానా బిజీగా ఉండటం వలన, చరణ్ రానా దగ్గర ఈ విషయాన్ని గురించి ప్రస్తావించలేదట. ఈ సినిమా కోసం రానాను తీసుకుంటే తప్పకుండా రానా ప్రత్యేక ఆకర్షణ అవుతాడనీ, చరణ్ అడిగితే రానా కాదనడమంటూ జరగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.