ఇటీవలే పవన్ మళ్ళీ తన ట్వీట్ పిట్టకు పని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ట్వీట్ దేనిగురించో కాదు.. ఉత్తరాది పెత్తనంపై. ఇటీవలే టీటీడీ అధికారిగా ఉత్తరాది వ్యక్తిని నియమించిన సంగతి విధితమే. దాంతో ఆ నియామకం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఉత్తర భారతానికి చెందిన ఐఏఎస్ నియామకాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ ఇదే విధంగా దక్షిణాదికి చెందిన అధికారులకు ఉత్తరాది పుణ్యక్షేత్రాల కీలక బాధ్యతలు అప్పగిస్తారా? అని తన ట్వీట్‌పిట్ట ద్వారా ప్రశ్నించారు పవన్.
అయితే పవన్ ట్వీట్స్ పిట్ట సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తున్న ఒక్కరోజులోనే మోహన్ బాబు టీటీడీ ఈవోగా నియమితులైన ఉత్తరాది ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింగల్‌ను అభినందిస్తూ ఓ నోట్‌ను విడుదల చేశారు. అంతే..దీంతో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు..పవన్ ట్వీట్స్‌కు కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మోహన్ బాబు ఇలా నోట్ విడుదల చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మారో వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లాతో, తిరుమలతో మోహన్ బాబుకు ఉన్న సాన్నిహిత్యం వల్లనే అక్కడి నియమితులైన అధికారిని స్వాగతిస్తూ మోహన్ బాబు ఈ నోట్ విడుదల చేశారని కొందరంటున్నారు. దీంతో మోహన్ బాబు విడుదల చేసిన ఈ నోట్‌లో కూడా వివాదాస్పద అంశాలు ఏవీ లేకపోవడంతో పవన్‌కు పంచ్ ఇచ్చారన్న వార్తలను నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
‘ఆధ్యాత్మికతకు ఆలవాలమైన తిరుమల దేవస్థానానికి అధికారిగా మీరు నియమితులవడం పట్ల సంతోషిస్తున్నానని, తానూ రాజకీయాల్లో ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధికి కృషి చేశాను’ అని మోహన్ బాబు లేఖలో పేర్కొన్నారు. అలాగే తిరుపతికి విద్యా సంస్థలు నెలకొల్పి సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో తమను వ్యక్తిగతంగా కలుస్తానని మోహన్ బాబు ఆ లేఖను ముగించారు.