అతి పిన్న వయస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మానియేల్ మేక్రాన్ విజయం సాధించారు. స్వతంత్ర్య అభ్యర్థి అయినా మేక్రాన్‌కు అనుకూలంగా 66.06శాతం ఓట్లు రాగా.. ప్రత్యర్థి అయిన లీపెన్‌కు 33.94శాతం ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 1958 తర్వాత ఫ్రాన్స్‌లోని రెండు ప్రధాన పార్టీల నుంచి కాకుండా మరో వ్యక్తిగా మెక్రన్.. ఈ పదవికి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మేక్రాన్ మాట్లాడుతూ ఫ్రాన్స్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. ఈ అధ్యాయం ఆశా.. నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తాను దేశ సమైక్యతకు.. యూరోప్ రక్షణకు హామీ ఇస్తానని అన్నారు. ఎన్ మార్చ్. ఈ పార్టీ పుట్టింది ఒక్క ఏడాది క్రితమే. 2016 మార్చి నెలలో ఈ పార్టీని స్థాపించారు ఇమ్మానుయెల్ మాక్రాన్. ఓ ఉద్యమంగా పుట్టిన పార్టీ కేవలం ఏడాదిలోనే ప్రభుత్వ పాలనను చేజిక్కించుకున్నది.
దేశాధ్యక్షుడిగా మేక్రాన్ విజయం సాధించడం ఓ సంచలనమే కాదు.. అతని వ్యక్తిగత జీవితం కూడా సంచలనమే. టీనేజీ వయసులోనే తీసుకున్న నిర్ణయాలు, వాటిని నిలబెట్టుకున్న విధాలు, అందుకు చేసిన పోరాటాలు అన్నీ సినిమా కథను తలపిస్తాయి. మేక్రాన్ అధ్యక్షుడిగా గెలవగానే… అతని స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, ఉపాధ్యాయులు, లెక్చరర్లు… అందరూ ఒకేసారి ‘ఎవరూ టీచర్ ను ప్రేమించి పెళ్లాడిన ఆ యువకుడేనా?’ అని మేక్రాన్ ను గుర్తు చేసుకున్నారు.
39 ఏళ్ల వయసులోనే దేశాధ్యక్ష పదవిని అలకరించనున్నమేక్రాన్… టీనేజీ వయసులో తనకు పాఠాలు చెప్పిన టీచర్ బ్రిగెట్టీపైనే మనసు పారేసుకున్నారు. అప్పటికి ఆమె వయసు 40 ఏళ్లు. అప్పటికే ఆవిడకు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు ఆమె కూతురు మేక్రాన్ కు క్లాస్ మేట్ కూడా. అన్నీ తెలిసి కూడా బ్రిగెట్టీని ఆరాధించారు మేక్రాన్. పరిస్థితులు ఎలా ఉన్నా… ఎవరేమనుకున్నా… ఆమె ఒప్పకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పారు మేక్రాన్. వారి ప్రేమ ఏళ్లు గడుస్తున్న చెక్కు చెదరలేదు. బ్రిగెట్టి తన ముగ్గురు పిల్లలకు 18 ఏళ్లు నిండాక ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. మేక్రాన్ 29 ఏళ్ల వయసులో 2007లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి పదేళ్లు కావొస్తుంది. మేక్రాన్ కు ఇప్పుడు 39 ఏళ్లు కాగా, బ్రిగెట్టికి 64 ఏళ్లు. ముసలి వయసులో ఉన్న తన భార్యని ఎప్పటిలాగే ప్రేమిస్తున్నారు ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మేక్రాన్. అతని గెలుపుతో ఎప్పుడో మరుగన పడిపోయిన వీరి ప్రేమకథ కూడా మళ్లీ వెలుగులోకి వచ్చింది. పారిస్ లోని ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలుగా ఈ ప్రేమకథే కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది. దేశాధ్యక్ష పదవికి పోటీపడ్డ మాక్రాన్ తన టీచర్‌తో ఉన్న అనుబంధం బాగా పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని గర్వంగా చెప్పుకున్నారు.