అప్పుడే రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎన్డీయే, యూపీఏ పక్షాలు తమ అభ్యర్థి ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఇప్పటికే పలువురి పేర్లు రాష్ట్రపతి అభ్యర్థిగా వినిపించాయి. అయితే, తొలి నుంచి బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి రాష్ట్రపతి అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు కూడా అద్వానీ ఎన్నిక లాంఛనమే అని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తాను రాష్ట్రపతి రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో బీజేపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.
దీంతో ఎన్డీఏ నుంచి రాష్ట్రపతిగా ఎవరి పేరును అధిష్టానం ప్రకటిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ రేసులో జార్ఖండ్ గవర్నర్ గిరిజన నేత ద్రౌపతి ముర్ము, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, మరో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ లు ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన వెంకయ్య… గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. దక్షిణాదిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్య నాయుడు ప్రస్తుతం కేంద్రంలో సమాచార, ప్రసారశాఖ నిర్వహిస్తున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థించిన మొదటి నాయకుల్లో ఒకరు. దక్షిణాదిలో విస్తరించాలని ఉరకలేస్తున్న కాషాయపార్టీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చు. అంతేగాదు వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెడితే తెలుగు రాష్ట్రాల నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని బీజేపీ భావిస్తోంది.
ఇక రేసులో మరో వ్యక్తి ద్రౌపది ముర్ము. ఒడిశాకు ద్రౌపది ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు. 2000-04 మధ్యకాలంలో ఒడిశా బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గిరిజన తెగకు చెందిన వ్యక్తిని రాష్ట్రపతిని చేస్తే తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది.అంతేగాదు ఇటీవల ఆమె ప్రధాని నరేంద్రమోడీని కలవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది.
ప్రస్తుతం లోక్ సభ స్పీకర్‌గా ఉన్న సుమిత్రా మహాజన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎనిమిదిసార్లు ఎంపీలోని ఇండోర్నుంచి లోక్‌సభకు ఎనికయ్యారు. అటల్‌బిహారీ వాజపేయి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్రమోడీ విశ్వాసం చూరగొన్న వ్యక్తి. ఇక చిన్నమ్మగా అందరి మన్నలు పొందుతున్న మరో వ్యక్తి సుష్మా స్వరాజ్. ఏడుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన సుష్మా ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖమంత్రిగా సేవలందిస్తోంది. మూడుసార్లు అసెంబ్లీకి ఎనికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు.