నిజాయితీగా కొత్త సినిమా తీశాం:కార్తీకేయ

26
- Advertisement -

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ ”నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు, సినిమాలు వేరు. ‘బెదురులంక 2012’ వేరు. ‘ఆర్ఎక్స్ 100’తో ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి ‘బెదురులంక 2012’తో అవుతున్నాను. రెండిటిలో శివ పేరు కుదిరింది. క్లాక్స్ కథ చెప్పినప్పుడు ఇందులో నా క్యారెక్టర్, హీరోయిజం ఎంత ఉంది? మార్కెట్ ఎలా ఉంది? వంటి లెక్కలు వేసుకోలేదు. కథ వినగానే నేను ఎంజాయ్ చేసినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే బావుంటుందని అనిపించింది. ఆరు గంటలకు క్లాక్స్ కథ చెప్పడం మొదలు పెడితే రాత్రి 12 అయ్యింది. ఈ కథను ఆడియన్స్ 100 పర్సెంట్ ఎంజాయ్ చేస్తారని, ఆలోచిస్తారని అనిపించింది. జీవితంపై క్లాక్స్ కు ఉన్న క్లారిటీ సినిమాలో కనిపిస్తుంది. మా వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ సినిమా చేస్తున్న క్రమంలో మనిషిగా నేను కూడా మారాను. ఆ మార్పు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో వేరేగా ఉన్నానని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇటువంటి కథను నాతో సినిమా చేయడానికి నిర్మాత నమ్మాలి. నాతో లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా చేయడానికి నిర్మాతలు వస్తారు. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని క్లాక్స్ నమ్మాడు. మేం ఇద్దరం ఈ సినిమా చేయగలమని నిర్మాత బెన్నీ నమ్మారు. న్యూ ఏజ్ ప్రొడ్యూసర్ ఆయన. బెన్నీ గారికి థాంక్స్. సినిమాలో కథానాయికగా ముందు నేహా శెట్టిని అనుకోలేదు. బెన్నీ గారు ఆమె పేరు చెబితే మేం డౌట్ పడ్డాం. మా భయం కన్నా ఆమె ఎక్కువ భయపడిందని షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది. రాధికా కనిపించకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుని నటించింది. తన క్యారెక్టర్ వరకు కాకుండా సినిమాను చూసింది. మణిశర్మ గారి ‘రామా చిలకమ్మా’ సాంగ్ వల్ల నాలో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఎంతో మంది హీరోలతో, ఎన్నో జానర్ సినిమాలు చేసినప్పటికీ… ఈ తరహా సినిమాను ఎప్పుడు చేయలేదని, తన మొదటి సినిమాకు పని చేసినట్లు చేస్తున్నానని మణిశర్మ గారు చెప్పారు. నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ పాటలకు నేను డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉంది. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ మనసు పెట్టి పని చేశారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కీలకమే. నేను ఈ సినిమా చేయడం లక్కీగా ఫీలవుతున్నా. నా సినిమాలు ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకులు నాపై ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు. ప్రతి సినిమాకు కష్టపడుతున్నా. ఈ సినిమాకు రిలాక్స్ కావచ్చు. ఇంతకు ముందు మిస్ అయినవి వడ్డీతో కలిపి రావచ్చు. నిజాయతీగా కొత్త సినిమా తీశాం. దీన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే… ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మరింత ఉత్సహం వస్తుంది. సినిమాపై మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 24వ రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయండి. మరిన్ని బ్లాక్ బస్టర్స్ చేయడానికి ఇంకా కష్టపడతా అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ”బెన్నీ గారు సెన్సిబుల్ కథలు ఎంపిక చేస్తారని అందరూ చెప్పారు. నేను సెన్సిబుల్ కథ రాస్తే సరిపోదు. దాన్ని గుర్తించి, అర్థం చేసుకోవాలనే వ్యక్తి కావాలి. నేను ఈ కథను 7, 8 ఏళ్లుగా చాలా మంది నిర్మాతలకు చెప్పా. వాళ్ళందరూ ఏవేవో చూశారు. బెన్నీ గారికి చెప్పినప్పుడు కోర్ పాయింట్ అర్థం చేసుకున్నారు. నేను చాలా మంది హీరోలకు కూడా కథ చెప్పా. తమకు తగ్గట్టు మార్చమని అడిగారు. కార్తికేయకు కథ చెప్పినప్పుడు బెన్నీ గారిలా కథను అర్థం చేసుకున్నారు. కార్తికేయ లాంటి హీరో, బెన్నీ గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం. మంచి టీమ్ కుదిరింది. మణిశర్మగారి సంగీతం, వినోద్‌ గారి సౌండ్‌ డిజైనింగ్‌ అద్భతం” అని అన్నారు.

‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ మల్లిడి మాట్లాడుతూ ”బెన్నీకి కంగ్రాట్స్ చెప్పాలి. ‘కలర్ ఫోటో’కి కొత్త కాన్సెప్ట్ నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. అలాగే, ఈ సినిమాకు కూడా కొత్త దర్శకుడిని లాంఛ్ చేస్తున్నారు. ‘బెదురులంక 2012’కు ‘కలర్ ఫోటో’ కంటే ఎక్కువ డబ్బులు, అవార్డులు రావాలి. కార్తికేయ, నేహా శెట్టి… ఇంకా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.

Also Read:ప్రపంచమంతా ఇస్రో నామజపం!

- Advertisement -