శభాష్! మీ పని తీరు అద్భుతంగా ఉంది. మీ అనుభవాలను, నిర్వహణా సామర్ధ్యాలను కలిపి, దేశంలోని మిగతా మహిళా సంఘాలకు ఇస్తున్న శిక్షణ గొప్పగా ఉంది. ఇంత గొప్ప కార్యాన్ని నిర్వర్తిస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచిన మహిళా మణులందరికీ అభినందనలు… అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. ఇటీవల లడక్ వెళ్ళి అక్కడ శిక్షణ ముగించి వచ్చిన హనుమకొండకు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన 15 మంది మహిళలతో మంత్రి హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ముఖా ముఖి అయ్యారు. వారితో గంటన్నరపాటు చర్చించారు. సాధించిన ప్రగతిని చూశారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వారు శిక్షణ ఇస్తున్న తీరు తెన్నులను అడిగారు. వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఏండ్లుగా వారు నిర్వహిస్తున్న శిక్షణ పద్ధతులను కూడా తెలుసుకున్నారు. వారిని శభాష్! మీ పని తీరు బాగుంది. మీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారంటూ అభినందించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, అప్పట్లో ఎన్టీ రామారావు డ్వాక్రా సంఘాలను పెట్టారు. వాటిని సీఎం కెసిఆర్ బలోపేతం చేశారు. అప్పట్లో అతి కొద్ది మొత్తం పొదుపు చేయడంతో ప్రారంభమై ఇవ్వాళ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం సహాయక సంఘాలలో 45,60,518 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఘటితమైన మహిళలు తెలంగాణలో తప్ప ఎక్కడా లేరన్నారు. మహిళలు బాగుపడితే, ఆ కుటుంబం, సమాజం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని తెలిపారు. అందుకే సిఎం కెసిఆర్ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. అనేక రుణాలు ఇప్పిస్తూ, మహిళలను పారిశ్రామికంగా ఎదిగేవిధంగా చేస్తున్నారు. అనేక పథకాలను మహిళల పేరునే, వారికే వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. అందుకే ఇవ్వాళ మన మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి వివరించారు. మహిళా సంఘాలు, అలాగే ఓరుగల్లు మహిళా సమాఖ్య ఇదే పని తీరును కొనసాగిస్తూ, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
Also Read:బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శిగా బండి..
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు వరంగల్ జెడ్పీ ఇన్ చార్జీ సిఇఓ, వరంగల్ డిఆర్ డిఓ సంపత్ రావు, సెర్ప్ కు చెందిన తక్కెళ్ళపల్లి రవిందర్ రావు, ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన మహిళలు, రిసోర్స్ పర్సన్స్, సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్, రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ ట్రైనర్స్, ప్రొఫెషనల్ రిసోర్స్ పర్సన్స్, ఎలక్ట్రానిక్ మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:Harishrao:తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే కుట్ర