బాహుబలి మానియా ఎవ్వరినీ వదలట్లేదు..చివరికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా. సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా సినిమా టికెట్ ధర రూ.200 మించొద్దు అని నిబంధనను పెట్టిన ఈ ముఖ్యమంత్రే ఆ గీత దాటేశారు. ఎంతలా అంటే..ఒక్కో టికెట్‌కు ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.1050.
అంటే.. ఆయన పెట్టిన పరిమితికి ఐదు రెట్లు ఎక్కువ. తాను, తన కుమారుడు, మనవలు ఇలా ఓ 40 మంది పరివారంతో ఈ సినిమా చూశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బెంగళూరులోని ఓరియన్ మాల్‌లోని గోల్డెన్ క్లాస్‌లో సాధారణ పబ్లిక్‌తో కలిసి ఆయన సినిమా చూశారు. దీంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తన మనవలు కచ్చితంగా సినిమా చూడాలని ఒత్తిడి చేయడంతో సిద్ధరామయ్య తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో టికెట్ ధర రూ.200 మించకూడదన్న నిబంధనను తీసుకొచ్చినా దానిని ఇంకా అమల్లోకి తీసుకురాలేదు.
అంతలోపే స్వయంగా ముఖ్యమంత్రే ఇలా ఐదు రెట్లు ఎక్కువ ధర చెల్లించి సినిమా చూడటం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. అయితే టికెట్ ధరకు పరిమితి విధించాలని ఒత్తిడి తీసుకొచ్చిన కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక చలనచిత్ర అకాడమీ మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించాయి.
అంతేకాదు టికెట్ ధర పరిమితి ఫైలుపై సంతకం చేయడం విషయంలోనూ సిద్దరామయ్యే కావాలనే నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి గత గురువారమే ఆయన ఈ ఫైలుపై సంతకం చేయాల్సి ఉన్నా.. ఆయన దుబాయ్‌కు వెళ్లారు. ఈలోపు బాహుబలి సినిమా విడుదల కావడం.. థియేటర్ల ఓనర్లు తమ ఇష్టానుసారం రేట్లు పెంచేయడం జరిగిపోయింది. ఇప్పుడు తాపీగా జనాలకు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మంగళవారం ఈ ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.