సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో జాతీయ రాజకీయాల్లో పోలిటికల్ హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా మోడిని గద్దె దించడం కోసం విపక్షాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే 26 పార్టీలతో కూటమిగా ఏర్పడి ఆ కూటమికి ” INDIA ” అని నామకరణం కూడా చేశారు. ఈ స్థాయిలో దూకుడు పెంచిన విపక్షలకు ఒక ప్రశ్న మాత్రం చిక్కుముడి గానే ఉంది. అదే ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న. మోడిని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న విపక్షాలు ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడంలో మాత్రం ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉన్నాయి.
నిన్న, మొన్న సమావేశం అయిన విపక్షాలు కూటమికి పేరు పెట్టాయి గాని పిఎం అభ్యర్థి ఎవరనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నితిశ్ కుమార్, రాహుల్ గాంధీ, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, శరత్ పవార్.. ఇలా హేమాహేమీలంతా కూడా ప్రధాని రేస్ లో ఉన్నవారే. కాగా కాంగ్రెస్ తరుపున ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో యూపీఏ కూటమికి కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహించింది గనుక ఆ కూటమిలో ఉన్న పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోక తప్పదు.
Also Read:తగ్గిన పేదరికం.. దటీజ్ కేసిఆర్!
కానీ ఇప్పుడా పరిస్థితి లేదు యూపీఏ కాస్త ” INDIA ” గా మారిపోయింది. అంటే కాకుండా గతంలో యూపీఏలో లేని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, జేడీయూ వంటి పార్టీలు ఇప్పుడు INDIA కూటమిలో ఉన్నాయి. దాంతో ఈ పార్టీల అధినేతలు రాహుల్ ను పిఎం అభ్యర్థిగా ఒప్పుకుంటారా ? అనే చెప్పలేని పరిస్థితి. కాగా ప్రస్తుతం విపక్షాలలోని కొందరు అధినేతలు మాత్రం రాహుల్ గాంధీని పిఎం అభ్యర్థిగా ఎన్నుకునేందుకు సుముఖంగానే ఉన్నారు. అయితే పిఎం పదవి పై ఎప్పటి నుంచో కలులు కంటున్న నితిశ్ కుమార్ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీకి ఎంతవరుకు మద్దతు ఇస్తారనేది ప్రశ్నార్థకమే. మొత్తానికి ప్రధాని అభ్యర్థి విషయంలో ఉన్న చిక్కు ముడిని విపక్షాలు ఎప్పుడు విప్పుతాయో చూడాలి.
Also Read:సమ్మె వీడి విధుల్లో చేరండి:హరీశ్ పిలుపు