ఐపీఎల్ సీజన్-10లో వరుస విజయాలతో ప్లే ఆఫ్ కు ముంబై ఇండియన్స్ అర్హత సాధించగా… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాభవాల పరంపరను కొనసాగిస్తోంది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో మరో బంతి మిగిలి ఉండగానే ఫోర్ కొట్టి జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ (56 పరుగులు) విజృంభించి జట్టుకు విజయం అందించాడు. దీంతో ఈ సీజన్ లో 8 మ్యాచ్ లలో గెలిచిన ఐపీఎల్ జట్టుగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలిచి, ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తరువాతి స్థానాల్లో వరుసగా… కోల్ కతా నైట్ రైడర్స్ (10 మ్యాచ్‌లలో 7 గెలుపు), సన్ రైజర్స్ హైదరాబాద్ (10 మ్యాచ్‌లలో 6 గెలుపు) ఉన్నాయి.
అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్ లో ఓపెనర్లు మన్‌దీప్ (17), కోహ్లి (20) తక్కువ వ్యవధిలో వెనుదిరగడంతో 40/2తో నిలిచింది. ఐతే ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ వచ్చీ రాగానే ముంబయి బౌలర్లపై దాడి చేశాడు. దీంతో ఏబీ ఈసారి భారీ ఇన్నింగ్స్‌తో బెంగళూరుకు భారీ స్కోరు అందిస్తాడని ఆశించారు అభిమానులు. కృనాల్ వేసిన ఒక ఓవర్లో 4, 6 బాదిన ఏబీ.. తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడబోయి బుమ్రా చేతికి చిక్కడంతో బెంగళూరుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ వెంటనే వాట్సన్ (3) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో జాదవ్ (28)తో కలిసి బెంగళూరును ఆదుకున్నాడు నేగి. 19 ఓవర్లకు 157/5తో ఉన్న ఆర్‌సీబీ.. 170 దాటేలా కనిపించింది. కానీ మెక్లెనగన్ (3/34) చివరి ఓవర్లో ఐదే పరుగులిచ్చాడు. చివరి మూడు బంతులకు మూడు వికెట్లు పడడంతో 162 పరుగులు చేసింది బెంగళూరు.