సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులన్నీ సొంతం చేసుకుని దూసుకుపోతున్న ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది.బాహుబలి-2 సినిమా విడుదలకు ముందే భారీ వ్యాపారం చేసినట్టు తెలుస్తోంది.ఈ సినిమా విషయంలో బెంగళూరులో ఒక తప్పిదం జరిగింది
అయితే ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా చూద్దామని ఎంతో ఉత్కంఠగా థియేటరుకు వెళ్లిన బెంగళూరు జనాలకు ఒక చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరు జనాలు ..ఆ ఆతృతలో సినిమా ఎక్కడ మొదలైంది.. ఎటు వైపు వెళ్తోంది అన్నది కూడా మైమరిచిపోయి చూస్తూ ఉండిపోయారు. ఐతే థియేటర్ ఆపరేటర్ ఇంటర్వెల్ నుంచి సినిమాను మొదలుపెట్టి.. తన పాటికి తాను రన్ చేస్తూ వెళ్లిపోగా జనాలు కూడా జరిగిన తప్పును పట్టించుకోకుండా సినిమా చూస్తూ ఉండిపోయారు. కానీ చివరగా యుద్ధ సన్నివేశం వచ్చాక కానీ.. తాము సినిమాను ఇంటర్వెల్ నుంచి చూస్తున్న సంగతి వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో మళ్లీ మొదట్నుంచి సినిమాను ప్రదర్శించాల్సి వచ్చింది.
బెంగళూరు మారథాలిలోని ప్రముఖ మల్టీప్లెక్స్ పీవీఆర్ లో ఈ తప్పిదం చోటు చేసుకోవడం విశేషం. నిన్న రాత్రి వేసిన స్పెషల్ ప్రివ్యూ షో సందర్భంగా ఇలా జరిగింది. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ మధ్యలో ముగియడం వల్ల దీనికి ఆరంభం విషయంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. నేరుగా ఇంటర్వెల్ తర్వాత సినిమా మొదలుపెట్టినా అంతగా పట్టించుకున్నట్లు లేరు. కొంత గందరగోళంగానే అనిపించినా.. ఇది స్క్రీన్ ప్లే మ్యాజిక్ అనుకున్నారో ఏమో.. సైలెంటుగా సినిమా చూస్తూ సాగిపోయారు. కానీ చివరికి వచ్చేసరికి సందేహం వచ్చి గోల చేశారు. ఆపరేటర్ తప్పు గుర్తించి మళ్లీ సినిమాను మొదట్నుంచి రన్ చేశాడు. దీని వల్ల అక్కడ షో అవ్వడానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. ద్వితీయార్ధాన్ని రెండోసారి చూస్తున్నందుకు కొందరు సంతోషించగా.. ఇంకొందరు అసహనానికి లోనయ్యారట.