అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాన్ పెను విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైంది. తాజాగా భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. బిపోర్‌జాయ్ తుఫాన్ పోరుబందర్‌కు పశ్చిమ నైఋతి దిశలో 300కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది. ఇది ఈ నెల 15 సాయంత్రం అతి తీవ్ర తుఫాన్‌గా తీరం దాటనున్నట్టు పేర్కొంది.
ఈ తుఫాన్ మాండ్వి(గుజరాత్) కరాచి (పాకిస్థాన్) మధ్య జఖౌ పోర్ట్(గుజరాత్) వద్ద తీరం దాటనున్నట్టు వెల్లడించింది. సముద్ర అలలు 2-3మీటర్ల ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో 3-6మీటర్ల ఎత్తుకు సముద్ర ఆలలు ఎగిసి పడతాయని వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు సగటున 150-160కి.మీ వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇవి గరిష్టంగా గంటకు 180కి.మీ వేగం వరకు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈ మేరకు సముద్ర తీరం నుంచి 10కి.మీ దూరం వరకు గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా సూచించారు. కచ్, సౌరాష్ట్రలోని ప్రజలను ఇళ్లను వీడి బయటకు రావొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సముద్రంలోకి ఇప్పటివరకు వెళ్లినవారిని, రిగ్‌లపై పనిచేసేవారిని తీరానికి తీసుకురావాలని కోస్ట్ గార్డ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్‌లో ఈ నెల 15వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
Also Read: Whatsapp:స్క్రీన్ షేరింగ్ ఫీచర్
కచ్, దేవ్‌భూమి ద్వారక, జామ్‌నగర్ ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. పొరు బందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సౌరాష్ట్రలోని మిగిలిన జిల్లాలు గుజరాత్ ఉత్తర ప్రాంతాలకు భారీ వర్షసూచనను తెలిపింది. అలాగే ఉత్తర గుజరాత్, దక్షిణ రాజస్థాన్‌లో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: Kavitha:ఆడబిడ్డకు అన్ని తానై నిలిచిన నేత సీఎం కేసీఆర్