సినీ ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూస్తున్న బాహుబలి-2 మొదటి రివ్యూ వచ్చేసింది. ప్రభాస్, రాణా, రాజమౌళి అభిమానులతోపాటు సగటు సినీ ప్రేక్షకుడిని ఆనందంలో ముంచెత్తే రివ్యూ వచ్చేసింది. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రశ్నతో కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. యావత్ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు రాజమౌళి. తనదైన భావోద్వేగాలకు తోడు అత్యాధునిక సాంకేతికను జోడించి ‘బాహుబలి: ది బిగినింగ్’ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. 5 ఏళ్ళ పాటు రాజమౌళితో సహా 900 మంది కాస్ట్ అండ్ క్రూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూ. 450 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీలో రెండవ, ఆఖరి భాగమైన ఈ చిత్రం శిఖరాగ్ర స్థాయి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజే థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాలను మిగిల్చింది ఇప్పుడు చూద్దాం…
కథ :
అమరేంద్ర బాహుబలి(ప్రభాస్)ని రాజమాత శివగామి(రమ్యకృష్ణ) మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండటంతో దేశ పర్యటనకు బయలుదేరతాడు బాహుబలి. కుంతల రాజ్యానికి చేరుకున్న బాహుబలి ఆ దేశ యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే బాహుబలి రాజు కావడం ఏమాత్రం ఇష్టంలేని భల్లలాదేవుడు తన కుట్రతో శివగామే బాహుబలిని రాజు కాకుండా ఆపేలా చేస్తాడు. అలా కుట్రతో రాజైన భల్లాలదేవుడు బాహుబలిని, అతని భార్య దేవసేనను ఎలాంటి కష్టాలు పెట్టాడు ? అసలు శివగామి బాహుబలిని రాజు కాకుండా ఎందుకు ఆపింది ? బాహుబలిని కట్టప్పే ఎందుకు చంపాల్సి వచ్చింది ? కన్నతల్లి అయిన శివగామిదేవిని కూడా భల్లాలుడు ఎందుకు చంపాలనుకుంటాడు ? తన తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకున్న మహేంద్ర బాహుబలి భల్లలాదేవుడ్ని ఎలా ఎదుర్కున్నాడు ? వారి మధ్య యుద్ధం ఎలా సాగింది ? చివరికి భల్లాలుడు ఎలా అంతమయ్యాడు ? అనేదే తెరపై నడిచే కథ.
ప్లస్ పాయింట్స్:
మొదటి భాగంతో పోలిస్తే బాహుబలి 2 ఎక్కువసేపు ఉంటుంది. దాదాపు మూడు గంటలపాటు సాగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే కథనంతో మనకు సమయమే తెలియదు. రాజమౌళి విజన్ కు తగ్గట్టు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ మాహిష్మతి సామ్రాజ్యాన్ని, కుంతల దేశాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు. ఆర్.సి. కమల్ కణ్ణన్ ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను, సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు. వీరి పనితనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తూ ఆశ్చర్యపడేలా చేసింది. దర్శకుడు రాజమౌళి అయితే సినిమా మొత్తం ప్రతి 15 నిముషాలకొక అదిరిపోయే సీన్ చూపించి సీట్ల నుండి కదలకుండా చేశాడు. తరువాత ఏం జరుగబోతుంది అనే ఉత్కంఠ సినిమా పూర్తయ్యే వరకు ప్రేక్షకుల్లో కొనసాగుతుంది. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ లోని హీరోయిజాన్ని తెరపై వీరోచితంగా చూపించడంలో జక్కన్న వందశాతం విజయం సాధించారు. అలాగే అతి ముఖ్యమైన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇన్నేళ్లు ప్రేక్షకులు తలలు బద్దలు కొట్టుకున్నా ఊహించలేని స్థాయిలో చూపించి అదుర్స్ అనిపించారు. అంతకు మించి కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణాలు, దారి తీసిన పరిస్థితులు వంటి అంశాలను నడిపిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది.
నటీనటుల నటన గురించి చెప్పాలంటే ముందుగా ప్రభాస్ గురించి చెప్పాల్సిందే.. బాహుబలి పాత్రను ప్రభాస్ తప్ప మరెవరూ పోషించలేరన్న విషయం తొలి భాగంలోనే అర్థమైంది. రెండో భాగంలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు ప్రభాస్. భావోద్వేగ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని నిరూపించాడు. శివగామిగా రమ్యకృష్ణ పాత్ర ప్రేక్షకుడి మదిలో చిరకాలం నిలిచిపోతుంది. కన్నకొడుకు ఒకవైపు.. పెంచిన కొడుకు మరోవైపు.. వీరిద్దరి మధ్య నలిగిపోతూ భావోద్వేగాలు పలికించిన తీరు అమోఘం. తొలిభాగంలో డీగ్లామర్ పాత్రకు పరిమితమైన అనుష్క ఆ లోటును రెండో భాగంలో భర్తీ చేసింది. వీర నారిగా కనిపిస్తూ తన ఎంపిక తప్పుకాదని నిరూపించింది. అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. బిజ్జలదేవగా నాజర్ క్రూరత్వాన్ని అద్భుతంగా పలికించారు. ప్రాణవాయువుగా నిలిచిన భళ్లాలదేవుడు పాత్ర పరిధి కాస్త తక్కువైనా రానా తనవంతు అద్భుతంగా నటించాడు.
మైనస్ పాయింట్స్:
ఈ అద్భుత దృశ్య కావ్యంలో చెప్పుకోడానికి పెద్దగా పొరపాట్లేమీ లేవు. క్లైమాక్స్ వార్ ఎపిసోడ్లో రానా, ప్రభాస్ ల మధ్య జరిగే పోరాటం భారీ స్థాయిలో గొప్పగానే ఉన్నా కూడా మిగిలిన సైన్యం చేసే యుద్ధం మొదటి భాగంలో క్లైమాక్స్ లో వచ్చే యుద్దమంత భీభత్సంగా అయితే లేదు. అలాగే సినిమా చివర్లో అనుష్క పాత్రకు ఇంకాస్త ఎమోషనల్ టచ్, తమన్నా పాత్రకు ఎలాంటి డైలాగ్స్ లేకపోవడం కొంత మైనస్‌గా అనుకోవచ్చు.
సాంకేతిక విభాగం :
రాజమౌళి తన ఊహల్లో ప్రతి సన్నివేశాన్ని ఎంత గొప్పగా అయితే ఊహించుకున్నాడో అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించాడు. ఒక చారిత్రక నైపథ్యంలో ఉన్న కథకు డ్రామాతో పాటు నేటి వ్యాపార ప్రపంచంలో ముఖ్యమైన వాణిజ్య అంశాలైన హాస్యం, రొమాన్స్ వంటి వాటిని కలిపి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా తీయడమంటే మాటలు కాదు. కానీ రాజమౌళి అదే పని చేశాడు. ఈ విజువల్ వండర్ రూపుదిద్దుకోవడానికి దర్శక, రచయితలతో పాటు సాంకేతిక విభాగాల పనితీరు కూడా గోప్ప స్థాయిలోనే ఉంది. వాటి గురించి మాట్లాడితే.. ఆర్. సి. కమల్ కణ్ణన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచస్థాయిలో ఉంది. ఇలాంటి గ్రాఫికల్ వర్క్ ను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ లేదు. సినిమాకున్నప్రధాన బలాల్లో ఒకటి ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకున్నప్రధాన బలాల్లో ఒకటి.
సందర్భానుసారంగా వచ్చే పాటలకు ఆయన చేసిన సంగీతం చాలా వినసొంపుగా ఉంది. ప్రభాస్ కనిపించే సీన్లలో బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే ‘హైస్స ముద్రస్స’ అనే పాట వినబడినప్పుడల్లా ఒళ్ళు పులకరించేలా చేసింది. రాజమౌళి విజన్ ను తన కెమెరాలో బందించి తెరపై ఆవిష్కరించగల సమర్థుడు సెంథిల్ కుమార్. అందుకే వీరి కలయిక బ్రహ్మాండమైన విజయాల్ని సాధించింది. ఎమోషనల్ సీన్లను బాగా క్యాప్చర్ చేశాడు. ఒక చిత్రాన్ని అద్భుత స్థాయిలో ప్రేక్షకులకు అందివ్వడానికి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ లు సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనబడింది. ఎడిటింగ్ బాగుంది. అలాగే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మొదటి అర్థ భాగంలో డిజైన్ చేసిన వార్ సీన్, క్లైమాక్స్ లో ప్రభాస్, రానా ల మధ్య కంపోజ్ చేసిన భీభత్సమైన పోరాటం ఆకట్టుకుంది.
తీర్పు:
రాజమౌళి తెరకెక్కించిన దృష్యకావ్యం బాహుబలి ప్రపంచ స్థాయిలోనే ఉంది. మొత్తంగా 24 విభాగాలనూ ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన తెలుగు సినిమాగా ప్రేక్షకుడు అనుభూతి పొందుతాడు. ఒక సినిమాలో ఇన్ని బలమైన పాత్రలను మరోసారి చూడలేమేమోనన్న రీతిలో చూపించాడు జక్కన్న.
విడుదల తేదీ:28/04/2017
రేటింగ్: 3.75/5
నటీనటులు:ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా
నిర్మాత:శోభు యార్లగడ్డ,ప్రసాద్ దేవినేని
సంగీతం:కీరవాణి
దర్శకత్వం:రాజమౌళి