అన్నాడీఎంకే పార్టీలో మరో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్టయిన కొద్ది గంటల్లోనే చిన్నమ్మ శశికళ ఫ్లెక్సీలను తొలగించారు అన్నాడీఎంకే కార్యకర్తలు. చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో శశికళ బ్యాన్లర్లు తీసేయాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
పార్టీని అన్నాడీఎంకేలో మళ్లీ విలీనం చేయాలంటే ముందు శశికళ ఫోటోలు తొలగించి, పార్టీ కార్యాలయాన్ని పవిత్రంగా ఉంచాలని పన్నీరు సెల్వం వర్గం డిమాండ్ చేసింది. దీంతో దినకరన్ అలా అరెస్టు కాగానే..ఇలా శశికళ ఫోటోలను పళనిస్వామి వర్గం తొలగించేసింది. దీనిపై పన్నీరు సెల్వం మీడియా ప్రతినిధి స్వామినాధన్ మాట్లాడుతూ, శశికళ ఫోటోలు, ఫ్లెక్సీలు తొలగించడం ఆనందంగా ఉందన్నారు.
కాగా.. అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు వ్యవహారంలో దినకరన్‌ను దిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే పళని స్వామి, పన్నీర్ వర్గం విలీనంపై చర్చలు కొనసాగుతున్నాయి. రేపోమాపో ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.