వ్యవసాయం అనేది జీవన విధానం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. హైటెక్స్‌లో రైతు హిత సదస్సులో సీఎం, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్ రైతులకు అర్దమయ్యేలా వ్యవసాయ విధానాలను తయారుచేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతు భాషలోనే మాట్లాడాలని తెలిపారు. రైతు ఒక గ్రహమైతే మిగితా వృత్తులన్ని ఉపగ్రహాలని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంతగా వృద్ధిరేటు తెలంగాణను ఉందన్నారు.
వ్యవసాయాన్ని క్రాప్ కాలనీలుగా గుర్తించి పంటలను విభజిస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖలో అధికారుల నియమాకాలకు చర్యలు చేపడుతామని తెలిపారు. వ్యవసాయ అధికారులకు ల్యాప్ టాప్లు, కంప్యూటర్లు అందజేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యవసాయం దేశానికే దిక్సూచి కావాలని…అధికారులకు తొక్కుడు బండకు ఉన్నంత ఓపిక ఉండాలన్నారు. నేను లక్ష్యాన్నే నిర్దేశిస్తా….అమల్లోకి తీసుకెళ్లాల్సింది అధికారులేనని వెల్లడించారు.
అంచెలంచెలుగా పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించామని, తెలంగాణ అభివృద్ధి సాధించి భారతదేశానికే దిక్సూచి అవుతుందని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఎరువులు, విద్యుత్ కొరత లేకుండా చేశామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ప్రగతి తెలంగాణలో ఉందని అన్నారు. మంచి వృద్ధిరేటు ఉన్న రాష్ట్రంలో వ్యవసాయం రంగంలోనూ లాభాలు రావడానికి కృషి చేస్తోందని అన్నారు.రైతులకు ఎరువుల పంపిణిని ప్రధాని అభినందించారని తెలిపారు.
వ్యవసాయ శాఖలో అధికారుల నియామకాలకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం స్పష్టం చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి 500 మంది సిబ్బంది కావాలని చెప్పారు. నియామక ప్రతిపాదనలు ఇస్తే..వెంటనే అంగీకరిస్తానన్నారు.
వ్యవసాయానికి ఏఈవోలకే కీలకమని వారికి వడ్డీ లేకుండా వాహనాలను అందజేస్తామని చెప్పారు. కొందరు సొకాల్డ్ నాయకులు వ్యవసాయం దండగ అన్నారు. కానీ మనం పండగ చేసి చూపిద్దమని తెలిపారు. ఎక్కువమందికి ఉపాధి కల్పించేది వ్యవసాయమేనని చెప్పారు.అవినీతికి తావు లేకుండా అధికారులు పనిచేయాలన్నారు. పథకాల అమలులో దళారులకు అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. రైతే రాజు అనేది ఆచరణలోనే చూపెట్టాలన్నారు.
గతంలో వ్యవసాయం సంక్షోభానికి కరెంట్ సమస్యే కారణమని భవిష్యత్తులో ఇకపై కరెంట్ సమస్య ఉండదని స్పష్టం చేశారు. రెవెన్యూ గ్రామాల్లో ఉన్న భూమి వివరాలు అందుబాటులో ఉండాలన్నారు. వ్యవసాయంపై రైతులకు పూర్తిస్ధాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. రైతుల సెల్ నంబర్‌తో సహా అన్ని వివరాలను తీసుకోవాలని చెప్పారు. ఏ రైతు పేరు మీద ఎంత భూమి ఉందో లెక్క తెలాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ భూమి ఎంత ఉందో లెక్క తేల్చాలన్నారు. తెలంగాణలో ఏ గుంటలో ఏ పంట ఉందో లెక్కలన్ని సీఎం టేబుల్ మీద ఉండాలని తెలిపారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్న జాతిరత్నాలని కొనియాడారు. రైతులకు పెట్టుబడి,నీళ్లు అందిస్తే బంగారాన్ని పండిస్తారని చెప్పారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని…ప్రతి అధికారి 5వేల ఎకరాల వివరాలను జూన్ 10 నాటికి సమగ్రంగా అందిచాలని చెప్పారు.