హైదరాబాద్ నగరం వ్యాపారులకు పెట్టుబడులకు స్వర్గధామమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ అద్భుతమైన వాతావరణం ఉందన్నారు. బయో ఏసియా సదస్సు విజయవంతంగా నిర్వహించుకన్నామని గుర్తు చేశారు. మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. 9 బిలియన్ టీకాలు హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారు అవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన డివైజెస్ పార్కులోనే ఉందన్నారు. దేశానికే ఆదర్శంగా మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఫార్మా పరిశ్రమలకు ఒకే చోట అత్యుత్తమ ప్రపంచస్థాయి వసతులతో కూడిన సుల్తాన్‌పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉపగ్రహాల తయారీ రంగంలో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందన్నారు. ఈ సందర్భంగా ప్రయివేట్ రాకెట్ లాంచింగ్ చేసిన స్కైరూట్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా డ్రోన్ల ద్వారా మెడిసన్ సరఫరా చేశామని అన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చేందిన సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో అతి పెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని వివరించారు. ఈవీ బ్యాటరీలు తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని రాబోయే రోజుల్లో వాహన రంగంలో ఈవీలదే అతిపెద్ద బాధ్యతన్నారు. టెక్స్‌టైల్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత పరిధి ఉందన్నారు. భారీ స్థాయిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ…రాష్ట్రం సాధిస్తున్న వృద్ధి వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం బాగుందన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించే టీ హబ్ ఒక మంచి ఆలోచన అని సుచిత్ర ఎల్ల అన్నారు. తెలంగాణకు పెట్టుబడుల కోసం మంత్రి కేటీఆర్ అవిరాళ కృషి చేస్తున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి…